కేటీఆర్(KTR) తెలంగాణ ఉద్యమాన్ని ‘తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ చచ్చుడో..’ అనే నినాదంతో ప్రజల్లోకి తీసుకెళ్లిన మహానాయకుడు కేసీఆర్(KCR) పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఆవిర్భవించిందని బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. హస్తినాపురంలోని జీఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఎల్‌బీనగర్ నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం ఎన్నడూ లేనంత అభివృద్ధి సాధించిందని, కాంగ్రెస్ (Congress) రెండున్నరేళ్ల పాలనలో మాత్రం ప్రజలకు కనిపించేలా ఒక్క పని కూడా జరగలేదని విమర్శించారు. నిజాం కాలంలో గ్రేటర్ హైదరాబాద్‌లో(Greater Hyderabad) మూడు ఆసుపత్రులు నిర్మితమైతే, బీఆర్‌ఎస్ హయాంలో నాలుగు ఆసుపత్రులు నిర్మించామని, 2.5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు అందించామని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా(HYDRAA) పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తోందని ఆరోపించారు.
అలాగే రాష్ట్రంలో మైనర్ బాలికపై (Minor Girl) జరిగిన అత్యాచార ఘటనను ప్రస్తావిస్తూ కేంద్రంలోని బీజేపీ(BJP), రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు తన కొడుకును ఎనిమిది రోజులుగా దాచిపెట్టి, బాధిత కుటుంబాన్ని బెదిరించి, మీడియా గొంతు నొక్కారని ఆరోపిస్తూ ఆయనను వెంటనే బర్తరఫ్ చేసి నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరోవైపు ‘ఎస్‌ఐఆర్’ (SIR) ప్రక్రియ పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించిన కేటీఆర్.. బీఆర్‌ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ సభ్యత్వం, కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన వారికే అవకాశాలు ఉంటాయని స్పష్టం చేస్తూ, ఎల్‌బీనగర్‌లోని 18 డివిజన్లలో బీఆర్‌ఎస్ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.








