బీరు హెల్దీ డ్రింకా?.. ‘బీచ్ షాక్స్’ కోసం నేతల తిప్పలు

బీరు హెల్దీ డ్రింకా?.. ‘బీచ్ షాక్స్’ కోసం నేతల తిప్పలు

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ‘బీచ్ షాక్స్’ (Beach Shacks) ఏర్పాటు వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. పర్యాటకం పేరుతో తీర ప్రాంతాల్లో మద్యం దుకాణాలు(Liquor Outlets), పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించడంపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే, ప్రజల అభ్యంతరాలను పక్కన పెట్టి, మద్యం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని చూస్తున్న అధికార కూటమి నేతలు.. దాన్ని సమర్థించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. బీచ్ షాక్స్‌ను ప్రమోట్ చేసే క్రమంలో ఏకంగా “బీరు (Beer) ఒక హెల్దీ డ్రింక్ (Healthy Drink)” అనే రేంజ్‌లో టీడీపీ నేతలు మాట్లాడుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కూల్ డ్రింక్స్ కంటే బీరే బెటరా..?
బీచ్ షాక్స్ విధానాన్ని సమర్థిస్తూ టీడీపీ(TDP) రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. “సాధారణ కూల్ డ్రింక్స్ కంటే బీరులో క్యాలరీల శాతం తక్కువగా ఉంటుంది” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీచ్ షాక్స్ ఏర్పాటు మంచిదేనంటూ ఆయన సమర్థించుకొచ్చారు. మద్యం వినియోగాన్ని, అందులోనూ బీరును ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా చూపించేలా అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే మాట్లాడటంపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

మరోవైపు ఈ బీచ్ షాక్స్ వివాదంపై హోంమంత్రి అనిత (Home Minister Anitha) కీలక వ్యాఖ్యలు చేశారు. “బీచ్ షాక్స్ ఏర్పాటు అనేది ముఖ్యమంత్రి(CM) చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆలోచన. దీనిని ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుంది. దీనికి అందరూ సహకరించండి” అని ఆమె కోరారు. సాక్ష్యాత్తు హోంమంత్రి.. తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బీచ్ షాక్స్‌ను సమర్థించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

గతంలో మంత్రి జవహర్.. ఇప్పుడు పల్లా
టీడీపీ(TDP) నేతలకు ‘బీరు’ను హెల్దీ డ్రింక్‌గా మార్చడం ఇదే మొదటిసారి కాదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎక్సైజ్ మంత్రి కేఎస్ జవహర్ (KS Jawahar) కూడా ఒక టీవీ డిబేట్‌లో “బీర్ ఈజ్ ఎ హెల్దీ డ్రింక్ (Beer is a Healthy Drink). బీరు ఆరోగ్యానికి మంచిదని నిరూపిస్తా” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి అప్పట్లో నెటిజ‌న్ల‌కు బుక్కయ్యారు. ఇప్పుడు మళ్లీ అదే బాటలో పల్లా శ్రీనివాసరావు కూడా కూల్ డ్రింక్స్‌తో బీరును పోలుస్తూ మాట్లాడటంతో.. “టీడీపీ(TDP) నేతలకు బీరుపై ఎందుకంత ప్రేమ?” అంటూ సోషల్ మీడియాలో పాత వీడియోలను, కొత్త వ్యాఖ్యలను జత చేస్తూ ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు.

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తీర ప్రాంత ప్రజలు
ప్రభుత్వం కేవలం మద్యం ఆదాయమే పరమావధిగా భావించి బీచ్‌లలో పాశ్చాత్య సంస్కృతిని, అసాంఘిక కార్యకలాపాలకు తావిచ్చే షాక్స్‌ను తీసుకురావడాన్ని తీర ప్రాంత ప్రజలు తీవ్రంగా అభ్యంతరపెడుతున్నారు. ప్రశాంతంగా ఉండే బీచ్‌లను తాగుబోతుల కేంద్రాలుగా మార్చవద్దని డిమాండ్ చేస్తున్నారు. మద్యం పాలసీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి చూసి, తామే తడబడి ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్న అధికార పార్టీ నేతల తీరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment