అన్న క్యాంటీన్లు.. ప్రచారం వర్సెస్ వాస్త‌వాలు

అన్న క్యాంటీన్లు.. ప్రచారం వర్సెస్ వాస్త‌వాలు

ఆంధ్రప్రదేశ్‌లో పేదల ఆకలి తీర్చడం కోసం ప్రవేశపెట్టిన ‘అన్న క్యాంటీన్లు’ ప్రస్తుతం రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వం వీటిపై చేస్తున్న ప్రచారానికి, అధికారికంగా విడుదల చేస్తున్న జీవోల్లోని లెక్కలకు అస్సలు పొంతన లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు, విశ్లేషకులు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను ఉటంకిస్తూ నిధుల దుర్వినియోగంపై ప్రశ్నలు సంధిస్తున్నారు.

రోజువారీ భోజన సంఖ్యలో భారీ వ్యత్యాసం
టీడీపీ ప్రభుత్వం ప్రచారంలో ప్రతి క్యాంటీన్‌లో రోజుకు 780 నుంచి 800 మంది తింటున్నారని, రాష్ట్రవ్యాప్తంగా 2.10 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని చెప్తోంది. కానీ, ప్రభుత్వ అధికారిక జీవోల్లోని బడ్జెట్ కేటాయింపులను గమనిస్తే వాస్తవాలు వేరేలా ఉన్నాయి. 2024లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం 203 అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 166 కోట్లు కేటాయించింది. అంటే ఒక్కో భోజనానికి రూ. 75 చొప్పున (ప్రభుత్వ వాటా + లబ్ధిదారుడి వాటా), ఏడాదికి 312 రోజుల లెక్కన చూస్తే.. ప్రభుత్వం కేటాయించిన రూ. 166 కోట్లు కేవలం రోజుకు 350 మందికి మాత్రమే సరిపోతాయి.

ప్రభుత్వం చెబుతున్నట్టుగా రోజుకు 800 మంది తింటే, బడ్జెట్ రూ. 500 కోట్లు దాటిపోవాలంటున్నాయి వైరి వ‌ర్గాలు. కేవలం రూ. 166 కోట్లు మాత్రమే కేటాయించారంటే, మిగిలిన 450 మందికి భోజనం ఎక్కడి నుంచి వస్తోంది? లేక కేవలం 350 మంది తింటున్న చోట 800 మంది అని లెక్కలు చూపిస్తున్నారా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

మధ్యాహ్న భోజన పథకంతో పోలిక
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి కేవలం రూ. 6 నుండి రూ. 10 మాత్రమే వెచ్చిస్తోంది. కానీ అన్న క్యాంటీన్లలో ఒక్కో పూట భోజనానికి రూ. 25 నుండి రూ. 30 (సబ్సిడీ కాకుండా) కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సొమ్మును కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే ఈ అధిక ధరలా? అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

అన్న క్యాంటీన్లలో ఆహారం కన్నా ఆడంబరాలకు, సాంకేతికతకు చేస్తున్న ఖర్చు ఆశ్చర్యం కలిగిస్తోందంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్లేట్లు లెక్కపెట్టే సాఫ్ట్‌వేర్ కోసం ఒక్కో క్యాంటీన్‌కు రూ. 4 లక్షల చొప్పున మొత్తం రూ. 7.5 కోట్లు కేటాయించడం విమర్శలకు దారితీస్తోంది. కుప్పం, హైకోర్టు క్యాంటీన్ల నిర్వహణ కోసం ఏకంగా రూ. 98.20 లక్షల పరిపాలనా అనుమతులు ఇవ్వడం వాస్తవ ఖర్చు కన్నా చాలా ఎక్కువని తెలుస్తోంది.

పాత క్యాంటీన్ల రిపేర్లకు రూ. 8 లక్షలు, కొత్త వాటికి రూ. 50 లక్షల వరకు ఖర్చు చేయడంతో పాటు, కేవలం ప్రారంభోత్సవాలు, బ్యానర్ల కోసమే రూ.18 కోట్లు ప్రజా ధనాన్ని వెచ్చించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దాత‌ల స‌హ‌కారంతో ఈ పథకం న‌డుస్తోంద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు గతంలో ప్ర‌క‌టించుకున్నా.. ఇవి వాస్త‌వంగా ప్ర‌భుత్వ ధ‌నంతోనే న‌డుస్తున్నాయ‌ని స్ప‌ష్టం అవుతోంద‌ని, పేద‌లు తినే లెక్క‌ల్లోనూ టీడీపీ వర్గాలు త‌ప్పుగా చూప‌డం, ప్ర‌చారం చేసుకోవ‌డంపై విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

పేదల ఆకలి తీర్చడం అనే ఉదాత్తమైన ఆశయం కంటే, పబ్లిసిటీకి, నిధుల మళ్లింపునకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి భారీగా నిధులు విడుదల చేయడం, దాన్ని తెలుగుదేశం పార్టీ సొంత కార్య‌క్ర‌మంగా ప్ర‌చారం చేసుకోవ‌డం వెనుక ఉన్న అసలు మర్మం ఏమిటో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment