అప్పుల్లో కూటమి ప్ర‌భుత్వం రికార్డ్.. 19 నెలల్లో రూ.3 ల‌క్ష‌ల కోట్ల రుణం!!

అప్పుల్లో ఏపీ ప్ర‌భుత్వం రికార్డ్.. 19 నెలల్లో రూ.3 ల‌క్ష‌ల కోట్ల రుణం!!
ఎన్నిక‌ల స‌మ‌యంలో సంప‌ద సృష్టిస్తా.. పేద‌ల‌కు పంచుతాన‌న్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మరోసారి భారీ అప్పు చేసింది. ప్రతి మంగళవారం జరిగే ఆర్‌బీఐ(RBI) వేలంలో భాగంగా ఈసారి కూడా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోని ప్రభుత్వం రూ.6,500 కోట్ల రుణాన్ని సమీకరించింది. వారం కిందటే రూ.4,000 కోట్ల అప్పు తీసుకున్న ప్రభుత్వం, తాజాగా తీసుకున్న అప్పుతో రాష్ట్ర మొత్తం అప్పు భారం రూ.3 లక్షల కోట్లకు చేరింది. దీంతో దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో ఏపీ (Andhra Pradesh) అగ్రస్థానంలో నిలిచిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డిసెంబర్ 31 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2,93,269 కోట్లుగా ఉండగా, జనవరి 6న తీసుకున్న తాజా రుణంతో అవి రూ.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏడాదిన్నర పాలనలోనే ఇంత భారీగా అప్పులు చేయడం ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర చ‌రిత్ర‌లోనే ఇదే తొలిసారిగా జరుగుతోందని విమర్శకులు అంటున్నారు. ఏపీ సీఎంలలో అత్యధిక అప్పులు చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలుస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మొత్తం అప్పుల్లో బడ్జెటరీ అప్పులు రూ.1,71,637 కోట్లు కాగా, బడ్జెట్ బయట తీసుకున్న అప్పులు రూ.1,27,632 కోట్లుగా ఉన్నాయని గ‌ణాంకాలు చెబుతున్నాయి.

కాగ్ లెక్కల (CAG Data) ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరం మార్చి వరకు నిర్ధారిత అప్పు రూ.81,597 కోట్లు కాగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు మరో రూ.77,040 కోట్ల అప్పు నమోదైంది. డిసెంబర్ 2న రూ.3,000 కోట్లు, డిసెంబర్ 30న రూ.4,000 కోట్లు, జనవరి 6న రూ.6,500 కోట్లు అప్పులు తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం భారీగా రుణాలు
మార్క్‌ఫెడ్ ద్వారా రూ.19,900 కోట్లు
జలజీవన్ మిషన్ కార్పొరేషన్ రూ.10,000 కోట్లు
ఏపీఎండీసీ రూ.9,000 కోట్లు
ఏపీఐఐసీ రూ.8,500 కోట్లు
పౌరసరఫరాల సంస్థ రూ.7,000 కోట్లు
ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.6,710 కోట్లు
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్ల ద్వారా రూ.5,750 కోట్లు
వీటికి అదనంగా డిస్కంలు, విద్యుత్ సంస్థలు, నాబార్డు, ఎస్బీఐ, ఇతర బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు సమీకరించాయి.

అమరావతి అభివృద్ధి పేరుతోనే రూ.47,387 కోట్ల అప్పులు
ప్రపంచ బ్యాంక్ (World Bank), ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ద్వారా రూ.15,000 కోట్లు
హడ్కో ద్వారా రూ.11,000 కోట్లు
నాబార్డు ద్వారా రూ.7,387 కోట్లు
కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5,000 కోట్లు
ఎన్‌ఏబీఎఫ్‌డీ నుంచి రూ.7,500 కోట్లు రుణంగా తీసుకున్నారు.
పెరుగుతున్న అప్పుల భారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశంపై రాజకీయ, ఆర్థిక వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

సంప‌ద సృష్టిస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన చంద్ర‌బాబు నాయుడు.. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి రికార్డ్ స్థాయిలో అప్పులు చేస్తున్నార‌ని ప్రతిప‌క్ష వైసీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంది. అప్పు ద్వారా తెచ్చిన డ‌బ్బు ప్ర‌జ‌ల‌కు కూడా పంచ‌కుండా ఎక్క‌డ దాచిపెడుతున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు ప్రభుత్వ నిధులు దుబారా చేస్తున్నారన్న విమర్శలు తీవ్రమయ్యాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment