వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటన ద్వారా రాష్ట్రంలో చట్టవ్యవస్ధ పూర్తిగా కుప్పకూలిపోయిందని స్పష్టంగా చాటిచెప్పుతోందని పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలపై నిర్భయంగా గొంతెత్తుతున్న ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందని వైసీపీ ఆరోపించింది. ఇది యాదృచ్ఛిక ఘటన కాదు, రాజకీయ ప్రేరేపిత హింసకు పరాకాష్ట అని పార్టీ పేర్కొంది.
అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని గుండాలు, అసాంఘిక శక్తులను రెచ్చగొట్టడం వెనుక అధికార పార్టీకి చెందిన వ్యక్తుల పాత్ర ఉందన్న అనుమానాలు తీవ్రంగా ఉన్నాయని వైసీపీ తెలిపింది. ఒక మాజీ మంత్రికి, సీనియర్ ప్రజాప్రతినిధికి రక్షణ లేకుండా పోయిన పరిస్థితి రాష్ట్రంలో ఎంతటి అరాచక పాలన నడుస్తోందో వెల్లడిస్తోందని పార్టీ మండిపడింది.
పోలీసు వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోయాయని, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నవారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ ఘటనపై ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు లేకపోవడం ప్రభుత్వ నిర్వీర్యతకు నిదర్శనమని పేర్కొంది.
అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నంపై తక్షణమే నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టి, దాడికి పాల్పడిన వారిని, వెనుక నుంచి ప్రోత్సహించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని వైసీపీ డిమాండ్ చేసింది. అంబటి రాంబాబుకు పూర్తి స్థాయి భద్రత కల్పించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష నేతల రక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని కోరింది.
హింస, బెదిరింపులు, దాడులతో వైసీని అణచివేయడం ఎవరి వల్లా కాదని పార్టీ స్పష్టం చేసింది. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతులను నొక్కివేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వైసీపీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించింది. చట్టసువ్యవస్థను ధ్వంసం చేసిన ఈ అరాచక పాలనకు తగిన గుణపాఠం ప్రజలే చెబుతారని వైసీపీ స్పష్టంగా పేర్కొంది.







