అమరావతి నిర్మాణ పనులు వేగం అందుకున్నాయని, భవిష్యత్తులో రాజధాని నిర్మాణమంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమరావతి నిర్మాణానికి భూములిచ్చి రైతులు చాలా పెద్ద త్యాగం చేశారని చెప్పారు. అమరావతిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల ప్రధాన కార్యాలయాల భవనాల నిర్మాణానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు హాజరయ్యారు. మొత్తం 15 బ్యాంకులు మరియు ప్రభుత్వ రంగ సంస్థల భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగాయి.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. నూతన రాజధానిని ఒక శ్రద్ధ ప్రణాళికతో నిర్మించడం చిన్న విషయం కాదని ఆమె అన్నారు. ఒకేచోట ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాలు ఉండటం అరుదైన విషయం అని నిర్మలా అన్నారు. ఈ నిర్ణయం భవిష్యత్తులో అమరావతి రాజధాని మోడల్‌కు ఆదర్శం అవుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోడీ వచ్చిన తరువాతే పంటల రవాణా కోసం ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయని, మహారాష్ట్ర నుంచి అరటికాయలు, తమిళనాడు నుంచి కొబ్బరి రవాణా అవుతున్నాయని వివరించారు. కూరగాయలు, పండ్లకు ఏపీని ప్రధాన హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు బ్యాంకులు పూర్తి మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు, రవాణా వ్యవస్థ బలోపేతానికి బ్యాంకర్లు ముందడుగు వేయాలని సూచించారు.
రాజధాని నిర్మాణ బాధ్యతను భుజాన వేసుకున్న సీఎం చంద్రబాబును చూసి అందరూ గర్వపడాలని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. అమరావతి అందరూ అనుకున్నట్లుగానే అభివృద్ధి చెందుతుందని చెప్పారు.








