స‌క‌ల శాఖ మంత్రిగా చిన‌బాబు..?

స‌క‌ల శాఖ మంత్రిగా చిన‌బాబు..?

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో మంత్రులు వ్యవహార శైలి గందరగోళంగా తయారైంది. ఏ మంత్రికీ తన శాఖ పరిధి ఏంటో.. తన అధికారాలేంటో.. ఏ విషయంపై స్పందించాలో.. దేనిపై స్పందించకూడదో కూడా తెలియని దుస్థితి నెలకొంది. ఆయా శాఖలకు సంబంధించి సమస్య వచ్చినప్పుడు.. సదరు మంత్రి కాకుండా మరో శాఖ మంత్రి స్పందిస్తున్న తీరు అయోమ‌యానికి గురిచేస్తోంది. మరోవైపు తోటి మంత్రుల శాఖల్లో నారా లోకేష్ వేలుపెట్టి వారి అధికారాలను కబ్జా చేస్తుండటం కూడా కనిపిస్తోంది.

లడ్డూ అంశంపై ఆనం ప్రేక్షక పాత్ర
2024 సెప్టెంబరులో తిరుపతి లడ్డూ నాణ్యత విషయంపై తీవ్ర వివాదం చెలరేగింది. దేవాదాయ శాఖ పరిధిలోని అంశం కావడంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దీనిపై స్పందించాల్సి ఉంది. కానీ, లడ్డూ అంశం అంత వివాదం చెలరేగినా ఆనం నోరెత్తలేదు. దేవాదాయ శాఖకు సంబంధమే లేని గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. కానీ, బాధ్యతగల మంత్రి ఆ వివాదంలో వాస్తవాలను వెలికితీయడం మాని.. ప్రాయశ్చిత దీక్షలంటూ దాన్ని మరింత ముదిరేలా వ్యవహరించారు.

ప‌వ‌న్ శాఖ‌పై లోకేష్ అత్యుత్సాహం
కొద్దిరోజులుగా వైయస్సార్ జిల్లా బద్వేలు నియోజవర్గం కాశినాయన మండలం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ కాశినాయన జ్యోతి క్షేత్రంలో సత్రాలు, ఇతర భవనాలను అటవీ శాఖ అధికారులు కూల్చివేస్తున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా ధార్మిక సేవలు, అన్నదానం చేస్తున్న ఈ క్షేత్రంలో ప్రభుత్వమే కూల్చివేతలు చేయడంపై భక్తులు, ఆధ్యాత్మికవేత్తల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కూల్చివేతలు జరుపుతున్నది అటవీ శాఖ కాబట్టి ఆ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వివరణ ఇవ్వడం గమనార్హం. కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలకు క్షమాపణ చెబుతున్నామని లోకేష్ ట్వీట్ చేశారు. అసలు స్పందించాల్సినది పవన్ కల్యాణ్..

పరిశ్రమల శాఖ అంశాలపైనా లోకేషే..
రాష్ట్రంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తన శాఖకు సంబంధించి ఎక్కడా స్పందించడం లేదు. ఆ శాఖలోనూ నారా లోకేష్ వేలు పెడుతున్నారు. దావోస్ పర్యటనలో హడావుడి అంతా లోకేష్‌దే కనిపించింది. పరిశ్రమల మంత్రి భరత్ పాత్ర పరిమితం. దావోస్ లో ఏపీ బృందం ఘోరంగా విఫలమైంది. పెట్టుబడులు సాధించలేకపోయింది. ఉత్త చేతులతో తిరిగి వచ్చారు. అప్పుడు సైతం పరిశ్రమలు, పెట్టుబడులు ఏం వచ్చాయన్నదానిపై నారా లోకేష్ స్పందించారు తప్ప భరత్ స్పందించలేదు. ఇలా ఏ శాఖ చూసినా ఆ మంత్రి కాకుండా లోకేష్ స్పందించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే..నారా లోకేష్ శాఖలన్నింటిపై పెత్తనం చేస్తూ.. వారి అధికారాలను కబ్జా చేయడం స్పష్టంగా కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment