‘చ‌లో విజ‌య‌వాడ’.. భారీగా త‌ర‌లివ‌చ్చిన ఆశావ‌ర్క‌ర్లు

'చ‌లో విజ‌య‌వాడ'.. భారీగా త‌ర‌లివ‌చ్చిన ఆశావ‌ర్క‌ర్లు

ఎన్నిక‌ల స‌మ‌యంలో తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆశా వర్కర్లు ఇవాళ ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసనను అడ్డుకునేందుకు పలు జిల్లాల్లో పోలీసులు ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నప్పటికీ, వేలాదిగా విజయవాడ ధర్నా చౌక్‌కు చేరుకున్నారు. త‌మ‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు.

ఆశా వర్కర్లు తమ ముఖ్యమైన డిమాండ్లను ప్రభుత్వం ఎదుట ఉంచారు. రూ.26,000 కనీస వేతనం అమలు చేయాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని, రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ అందించాలని, పని భారాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని ప్ర‌భుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే తాము పోరాటాన్ని ఉధృతం చేస్తామ‌ని ఆశా వర్కర్లు హెచ్చ‌రిస్తున్నారు.

చర్చలు విఫలం – నిరసన ఉధృతం
గత రెండు రోజులుగా ప్రభుత్వం ఆశా వర్కర్లతో చర్చలు జరిపినా, ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు బహిరంగ నిరసనకు దిగారు. గత సమ్మె సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను జీవోలు ద్వారా అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గురువారం, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాదిమంది ఆశా వర్కర్లు విజయవాడ ధర్నా చౌక్‌కు చేరుకుని, రోడ్లపై కార్పెట్లు వేసుకుని ఎండలో నిరసన చేపట్టారు.

ఆశా వర్కర్ల పెద్ద ఎత్తున ర్యాలీ కారణంగా, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిరసనపై నిఘా పెట్టేందుకు డ్రోన్లు, ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు 10,000 మంది ఆశా వర్కర్లు ధర్నాకు హాజరయ్యే అవకాశం ఉందని యూనియన్ నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆశా వర్కర్లు తేల్చిచెబుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment