సింగపూర్‌లోని భారతీయ సంతతి ప్రతిపక్ష నేత ప్రీతమ్ సింగ్ (Pritam Singh)పై పార్లమెంటులో అబద్ధాలు చెప్పారని న్యాయస్థానం తేల్చింది. ఈ కేసులో ఆయనకు 14,000 సింగపూర్ డాలర్ల (రూ.9 లక్షలు) జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే, ఈ శిక్షతో ఆయన ఎంపీ పదవికి ఎటువంటి ముప్పు లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
సింగపూర్ వర్కర్స్ పార్టీకి ప్రతినిధిగా ఉన్న ప్రీతమ్ సింగ్.. 2021లో తన పార్టీకి చెందిన మాజీ ఎంపీ రయీసా ఖాన్‌పై వచ్చిన అబద్ధాల ఆరోపణల కేసులో విచారణకు హాజరయ్యారు. అయితే, కమిటీ ఎదుట రెండు సందర్భాల్లో తప్పుడు వాంగ్మూలం ఇచ్చారనే అభియోగాలు రుజువయ్యాయి.
ఎంపీ పదవికి ఎటువంటి ముప్పు లేదు!
రెండు అభియోగాలు రుజువు కావడంతో ఒక్కో కేసులో గరిష్ఠంగా 7 వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఎంపీ పదవి కోల్పోవాలంటే 10,000 డాలర్లకు పైగా జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించిన సందర్భంలో మాత్రమే అనర్హత వేటు ఉంటుంది. అయితే, ప్రీతమ్‌కు ఒక్కో కేసులో గరిష్ఠంగా 7,000 డాలర్ల జరిమానా మాత్రమే పడింది కాబట్టి, ఆయన సభ్యత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ తీర్పు అనంతరం ప్రీతమ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.








