తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అదే విధంగా పలువురు రాజకీయ ప్రముఖులు కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
‘కేసీఆర్ గారి కడుపున పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. ప్రతీ తండ్రీ తన పిల్లలకి హీరో అవుతాడు. కానీ నా తండ్రి నా ఒక్కడికే కాదు, మొత్తం తెలంగాణకు హీరో. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హీరో. కలలు కంటారు, వాటిని నెరవేర్చడానికి నిబద్ధతతో ముందుకు సాగుతారు. విమర్శలను ఎదుర్కొని తన లక్ష్యాన్ని సాధించారని గర్వంగా చెప్పగలను. తెలంగాణ అనే కలను ప్రేమించి, తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించకుండా రాష్ట్రాన్ని సాధించారు. నేను మీ వారసత్వానికి అర్హుడిగా ఉండేందుకు నిరంతరం కృషి చేస్తాను‘ అని పేర్కొన్నారు.
కేసీఆర్ కుమార్తె కవిత కూడా తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.








