లాస్ ఏంజెలిస్‌ను దహించివేస్తున్న కార్చిచ్చు ఒలంపిక్స్ విజేతకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఇప్పటికే వందలాది మంది జీవితాలను కుదిపేసిన ఈ మంటలు US ఒలింపిక్ స్విమ్మర్ గ్యారీ హాల్ జూనియర్ ఇంటితో పాటు ఒలింపిక్స్‌లో అతను గెలుచుకున్న 10 పతకాలను కాల్చి బూడిద చేసింది. 3 వేర్వేరు ఒలింపిక్ ఎడిషన్లలో 10 పతకాలు గెలుచుకున్న గ్యారీ, తన అద్భుతమైన విజయం కోసం చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. “ఇన్ని సంవత్సరాల కష్టం ఒక క్షణంలో మాయమైపోయింది” అని చెప్పిన ఆయన, ఈ దుర్ఘటన తన జీవితానికి ఒక చేదు గుర్తుగా మిగిలిపోతుందని తెలిపారు.
కార్చిచ్చు మూలంగా ఇప్పటివరకు 10 వేలకు పైగా లగ్జరీ ఇళ్లు, ఆఫీసులు ఇతర నిర్మాణాలు కాలిబూడిదయ్యాయి. పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారని అధికారులు ప్రకటించారు. కార్చిచ్చు కారణంగా మొత్తం రూ.12లక్షల కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు ఆక్యూ వెదర్ అనే సంస్థ అంచనా వేసింది.