పవన్ శాఖలో విధ్వంసం.. సొంత పార్టీ నేతలే సహించలేని దోపిడీ

పవన్ శాఖలో విధ్వంసం.. సొంత పార్టీ నేతలే సహించలేని దోపిడీ

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వ్యవహారశైలి ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రుషికొండపై జరిగిన నిర్మాణాలపై పర్యావరణ విధ్వంసం అంటూ నానా యాగీ చేసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న ప్రకృతి దోపిడీని, కొండల విధ్వంసాన్ని చూస్తూ మౌనం వ‌హిస్తున్నారు.

సాక్షాత్తూ పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న పర్యావరణ శాఖ కళ్లముందే జరుగుతున్న ఈ అరాచకాలను సొంత పార్టీ నేతలు, ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు సైతం సహించలేకపోతున్నారు. తాజాగా జనసేన మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పవన్ క‌ళ్యాణ్ ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేశాయి.

నాడు గగ్గోలు.. నేడు గప్‌చుప్!
రుషికొండపై పర్యావరణ నిబంధనల ఉల్లంఘన జరిగిందని కేంద్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై స్పందించిన బొలిశెట్టి సత్యనారాయణ, పవన్ కల్యాణ్ తీరును సూటిగా నిలదీశారు. “రుషికొండకు ఒక న్యాయం.. సింహాచలానికి మరో న్యాయమా?” అంటూ ఆయన ప్రశ్నించారు. నాడు రుషికొండ విషయంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై గ‌గ్గోలు పెడుతూ హద్దు లేని విమర్శలు గుప్పించి, గళమెత్తిన పవన్ కల్యాణ్.. నేడు విశాఖలోని సింహాచలం కొండలను యథేచ్ఛగా ధ్వంసం చేస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతల అండతో, కార్పొరేట్ ప్రాజెక్టుల ముసుగులో సాగుతున్న ఈ విధ్వంసానికి పవన్ మౌనమే సమ్మతిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పది కొండలకు బోడిగుండు.. విశాఖకు పెను ప్రమాదం
విశాఖపట్నంలో అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నామరూపాలు లేకుండా చేస్తున్నారని బొలిశెట్టి మండిపడ్డారు. సింహాచలం కొండలను పిండి చేయడమే కాకుండా, విశాఖ పరిధిలో ఏకంగా పది కొండలకు బోడిగుండు కొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీస ప్రజాభిప్రాయ సేకరణ కూడా లేకుండా సాగుతున్న ఈ ప్రకృతి విధ్వంసం విశాఖ భవిష్యత్తుకు పెను ప్రమాదంగా మారనుందని హెచ్చరించారు. కొండలను గుల్ల చేసి, పచ్చని అడవులను నాశనం చేసి సాధించే అభివృద్ధి ఎవరి కోసమని, ఎవరి జేబులు నింపడానికని ఆయన నిలదీశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న తప్పుడు పర్యావరణ విధానాలను పవన్ కల్యాణ్ సమర్థించడం ఏమాత్రం సరికాదని బొలిశెట్టి హితవు పలికారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యతలను భుజాన వేసుకున్న మంత్రిగానే కాకుండా, సిద్ధాంతాల గురించి మాట్లాడే నాయకుడిగా కూడా పవన్ విఫలమయ్యారనే భావన జనసేన శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. సొంత శాఖ పరిధిలోనే కొండలు మాయమవుతుంటే అడ్డుకోలేని నిస్సహాయతలో ఉన్నారా, లేక కూటమి ధర్మం పేరుతో ప్రకృతి దోపిడీకి సహకరిస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

2029లో ప్రజలే బుద్ధి చెబుతారు
సింహాచలం కొండలపై జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని తక్షణమే నిలిపివేయాలని బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఒకవేళ పాలకులు తమ రెండు నాలుకల ధోరణిని మార్చుకోకపోతే, 2029 ఎన్నికల్లో ప్రజలే మరో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటారని ఆయన గట్టిగా హెచ్చరించారు. మొత్తానికి, ఋషికొండ పేరుతో రాజకీయ లబ్ధి పొందిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు సొంత శాఖలో జరుగుతున్న విధ్వంసంపై సొంత మనుషుల నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Join WhatsApp

Join Now

Leave a Comment