ఇంటర్‌ బోర్డు విలీనాన్ని అంగీకరించం.. ప్రభుత్వ తీరుపై కవిత ఫైర్‌

ఇంటర్‌ బోర్డు విలీనాన్ని అంగీకరించం.. ప్రభుత్వ తీరుపై కవిత ఫైర్‌

Summarize with AI

ఇంటర్మీడియట్‌ బోర్డును ఏకపక్షంగా పాఠశాల విద్యలో విలీనం చేస్తామంటే అంగీకరించబోమని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో ఆమె మాట్లాడుతూ ఇంటర్‌ బోర్డు విలీనం, రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రైతుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును విమర్శించారు. తల్లిదండ్రులు, జూనియర్‌ కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు, విద్యావేత్తలతో చర్చించిన తర్వాతే ఇంటర్‌ బోర్డు విలీనంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పాఠశాల విద్యలో ఇంటర్‌ విద్యను విలీనం చేస్తారా? లేక ఇంటర్‌ విద్యలో పాఠశాల విద్యను విలీనం చేస్తారా? అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కవిత కోరారు. ప్రయోగశాలలు, మౌలిక వసతులు, బోధనా సిబ్బందికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఇప్పటికే ఇంటర్‌ విద్య కోసం తల్లిదండ్రులు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని, 9 నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానంలోకి తీసుకొస్తే ఫీజుల భారం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడం, కార్పొరేట్‌ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించడంపై ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

నిజామాబాద్‌ జిల్లాలో కేవలం 18 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా గుర్తించారని, మిగిలిన మండలాల్లోనూ కరువు ఛాయలు, తాగునీటి సమస్యలు ఉన్నాయని కవిత పేర్కొన్నారు. ఇప్పటికే గుర్తించిన మండలాలకు ఎలాంటి సాయం అందిస్తారనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్నారు. మరోసారి సర్వే నిర్వహించి కరువు మండలాల అదనపు జాబితాను ప్రకటించాలని కోరారు.

ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచిస్తున్న ప్రభుత్వం ఏ పంటలు వేయాలి? వాటిని ఏ ధరకు కొనుగోలు చేస్తుందనే విషయాలను చెప్పడం లేదని కవిత విమర్శించారు. సబ్సిడీలు, యూరియా సరఫరాపైనా స్పష్టత లేదన్నారు. ఇష్టానుసారంగా విద్యుత్‌ కోతలు విధిస్తుంటే రైతులు పంటలు సాగు చేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని రైతులకు స్పష్టమైన సాగు ప్రణాళికను అందించాలని డిమాండ్‌ చేశారు.

కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు కరువుపై మాట్లాడటం లేదని, కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురావడం లేదని విమర్శించారు. 16వ ఆర్థిక సంఘం నిధులు అందక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కేంద్రంతో పోరాడి నిధులు విడుదలయ్యేలా చూడాలని కోరారు.

కేంద్రంలో అధికారంలో ఉన్నవారు పాదయాత్రలు చేస్తుంటే, రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు సమావేశాలు నిర్వహిస్తున్నారని కవిత విమర్శించారు. స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా అన్నట్లుగా తమను తామే పొగుడుకుంటూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రచార కార్యక్రమాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోకి వచ్చి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment