డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మహంకాళి ఆలయం నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ పాల్గొన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కిషన్‌రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డ్రగ్స్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన పాదయాత్రను వెంకటేష్ జెండా ఊపి ప్రారంభించారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: వెంకటేష్
2029 నాటికి దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలన్న సంకల్పానికి తన పూర్తి మద్దతు ఉంటుందని వెంకటేష్ తెలిపారు. యువత, విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి సంకల్పాన్ని తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఇది పార్టీ కార్యక్రమం కాదు.. ప్రజా ఉద్యమం: కిషన్‌రెడ్డి
దేశద్రోహులు డ్రగ్స్ ద్వారా మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చి కుటుంబాలకు, సమాజానికి దూరం చేస్తున్నారని పేర్కొన్నారు. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించారని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. నషా ముక్త్ భారత్ కేవలం ప్రభుత్వానికో, రాజకీయ పార్టీకో సంబంధించిన కార్యక్రమం కాదని, ఇదొక ప్రజా ఉద్యమమని స్పష్టం చేశారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ మూడు రోజులపాటు పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. తనతో పాటు విద్యార్థులు, యువత పెద్దఎత్తున పాదయాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.








