2024 ఎన్నిక‌ల్లో ఓటు చోరీ.. ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ సంచ‌ల‌న క‌థ‌నం

2024 ఎన్నిక‌ల్లో ఓటు చోరీ.. ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ సంచ‌ల‌న క‌థ‌నం

Summarize with AI

2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, లెక్కల పారదర్శకతపై ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ తన ‘ఎలక్షన్ ఆడిట్’ సిరీస్‌లోని మూడో పరిశోధనాత్మక కథనంలో సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం అంతర్భాగంగా ఉన్న చిత్తూరు లోక్‌సభ స్థానంలో, పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్ల సంఖ్యపై ఎన్నికల అధికారుల నివేదికల్లో ఏకంగా 31,471 ఓట్ల భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఈ కథనం బయటపెట్టింది. ఈ స్టోరీపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

అసలేం జరిగింది?
బహిర్గతం కాని ఎన్నికల సంఘం (ఈసీ) అంతర్గత నివేదికలను విశ్లేషించిన ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ కీలక గణాంకాలను తెరపైకి తెచ్చింది. చిత్తూరు పార్లమెంటు పరిధిలో సాయంత్రం 6 గంటలకు క్యూలైన్లలో 56,067 మంది ఓటర్లు వేచి ఉన్నట్లు అధికారులు నమోదు చేశారు.

కానీ, అదే చిత్తూరు లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక రోజు వ్యవధిలో పంపిన మరో నివేదికలో ఆ సంఖ్యను కేవలం 24,596 మందిగానే పేర్కొన్నారు.

ఒకే క్యూలైన్.. వేర్వేరు లెక్కలు ఎలా సాధ్యం?
2024లో ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఒకే పోలింగ్ కేంద్రంలో, ఒకే క్యూలైన్‌లో నిలబడిన ఓటర్లు రెండు ఓట్లు వేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్నవారికి ప్రిసైడింగ్ అధికారి ప్రత్యేక స్లిప్పులు జారీ చేసి, ఆ సంఖ్యను తన డైరీలో నమోదు చేయాలి. మరుసటి రోజు రిటర్నింగ్ అధికారి (RO) ఈ డైరీని, ఓటర్ల సంతకాలతో కూడిన ఫారం-17ఏ రిజిస్టర్‌ను పరిశీలించి అవకతవకలు ఉంటే రీపోలింగ్‌కు సిఫార్సు చేయాలి. ఒకే క్యూలైన్‌కు సంబంధించి ఒకే రోజు వ్యవధిలో పంపిన రెండు అధికారిక నివేదికల్లో 31 వేలకు పైగా ఓటర్ల తేడా ఎలా వచ్చిందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

విచారణపై నీలినీడలు
చిత్తూరు లోక్‌సభతో పాటు దాని పరిధిలోని కుప్పం సహా ఏడు అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. పోలింగ్ రోజున పలు చోట్ల హింసాత్మక ఘటనలు, ఈవీఎంల మొరాయింపు కారణంగా అర్ధరాత్రి దాటిన తర్వాత, ఒకచోట తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని అప్పట్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సైతం అంగీకరించారు. రాత్రివేళ పోలింగ్‌పై ప్రతిపక్షాలు అప్పుడే రిగ్గింగ్ ఆరోపణలు చేశాయి.

అయితే, రికార్డుల్లో ఇంత భారీ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తున్నా ఎన్నికల సంఘం ఎటువంటి విచారణ జరిపిన దాఖలాలు లేవని కథనం స్పష్టం చేసింది. దీనిపై వివరణ కోరగా కేంద్ర ఎన్నికల సంఘం మౌనం వహించిందని, రాష్ట్ర సీఈవో కార్యాలయం జిల్లా ఎన్నికల అధికారిని (DEO) సంప్రదించాలని సూచించిందని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పేర్కొంది. ఇప్పటివరకు చిత్తూరు నివేదికలను మాత్రమే పరిశీలించామని, మిగిలిన నియోజకవర్గాల డేటాను విశ్లేషించాల్సి ఉందని ఆ సంస్థ తెలిపింది.

నివేదికల మధ్య ఉన్న ఈ 31,471 ఓట్ల వ్యత్యాసం ఒక్కటే ఓట్ల చోరీ జరిగిందని నిర్ధారించనప్పటికీ, ఎన్నికల నిర్వహణ, రికార్డుల భద్రతపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తోంది. రెండు నివేదికల్లో ఏది వాస్తవమో తేలాలంటే ఎన్నికల సంఘం తక్షణమే అధికారిక విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment