‘రామాయణ’(Ramayana) బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1,500 కోట్ల వసూళ్ల మార్కును దాటిన ఈ చిత్రం.. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా రికార్డు సృష్టించిన అమీర్ ఖాన్(Aamir Khan) ‘దంగల్’పై (Dangal) కన్నేసింది. థియేటర్లలో 15 రోజులు పూర్తి చేసుకున్న రామాయణ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,547.15 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు సమాచారం. సాక్నిల్క్ నివేదిక ప్రకారం.. 15వ రోజు భారత్లో రూ.19.35 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టగా, ఇందులో హిందీ వెర్షన్ వాటా రూ.14 కోట్లు. ఇక ఓవర్సీస్ మార్కెట్లో అదే రోజు రూ.14 కోట్లు వసూలు చేసింది. దీంతో విదేశాల్లో ఈ సినిమా మొత్తం గ్రాస్ వసూళ్లు (Gross Collections) రూ.515 కోట్లకు చేరుకున్నాయి.
మరోవైపు 2016లో విడుదలైన అమీర్ ఖాన్ ‘దంగల్’ ప్రపంచవ్యాప్తంగా రూ.2,070.30 కోట్ల గ్రాస్ వసూళ్లతో (Gross Collections)ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం రామాయణ వసూళ్లు రూ.1,547.15 కోట్లుగా ఉండటంతో దంగల్ రికార్డును అధిగమించాలంటే ఇంకా రూ.523.15 కోట్లు రాబట్టాల్సి ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో(International Markets) దంగల్ సాధించిన భారీ వసూళ్లే దాని రికార్డుకు ప్రధాన కారణం. రామాయణ ఇప్పటికే మంచి వసూళ్లను సాధించినప్పటికీ, దంగల్ను అధిగమించాలంటే ఇదే స్థాయిలో మరికొంత కాలం బాక్సాఫీస్ జోరును కొనసాగించాల్సి ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం రూ.2,000 కోట్ల మైలురాయిని దాటి భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.








