కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎంపిక కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని బీజేపీకి(BJP) కేటాయించడంతో నాగాయలంక బీజేపీ జడ్పీటీసీ భోగాది రమాదేవికి(Bhogadi Ramadevi) అవకాశం దక్కింది. దీంతో జడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్న టీడీపీ(TDP), జనసేన(Jana Sena) నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎన్నికల పోలింగ్‌కు ముందు నుంచే జడ్పీ చైర్పర్సన్ పదవిని దక్కించుకునేందుకు ఇరుపార్టీల నేతలు ఎవరికి వారుగా ప్రయత్నాలు సాగించారు.
తన వర్గీయులకు జడ్పీ చైర్పర్సన్ (ZP Chairperson) పదవి దక్కేలా మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి (Balashowry) ప్రయత్నించారు. తన భార్యను జడ్పీ చైర్పర్సన్ చేయాలని అవనిగడ్డ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి విక్కుర్తి శ్రీనివాసరావు (Vikkurthi Srinivasa Rao) తీవ్ర ప్రయత్నాలు చేశారు. మరోవైపు పమిడిముక్కల జడ్పీటీసీ తాతినేని ప్రవళిని (Tatineni Pravalini) జడ్పీ చైర్పర్సన్ చేస్తానని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రచారం చేశారు. కంకిపాడు టీడీపీ జడ్పీటీసీ దండమూడి పూజిత (Dandamudi Poojitha) కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.
అయితే కూటమి పదవుల పంపకంలో భాగంగా జడ్పీ పీఠాన్ని బీజేపీకి కేటాయించడంతో వీరందరికీ నిరాశ ఎదురైంది. దండమూడి పూజితకు చంద్రబాబు (Chandrababu) జడ్పీ వైస్ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. జడ్పీ పీఠం కోసం టీడీపీ, జనసేన నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కూటమిలో పదవుల పంపకం మరోసారి చర్చనీయాంశంగా మారింది.








