ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన స్థానంలో ఆటవిక రాజ్యం నడుస్తోందా అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సందర్భంగా తలెత్తిన వివాదాలపై రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారా అంటూ సుబ్రహ్మణ్యస్వామి ప్రశ్నించారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలే ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్నారు. రాజకీయ అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నికల స్వేచ్ఛను, ప్రజాస్వామ్య విలువలను బలిపీఠం ఎక్కించకూడదని వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమగ్రతను, పారదర్శకతను కాపాడేందుకు కఠినమైన, అమలు చేయదగిన మార్గదర్శకాలు అవసరమని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా అధికార కూటమిలో భాగమైన బీజేపీకి చెందిన సీనియర్ నేత ఎన్నికల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది.








