సీనియర్ నేత శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

సీనియర్ నేత శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

Summarize with AI

సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పలు పదవులు నిర్వహించారు. జనతా పార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన విజయరామరాజు ఆ తర్వాత కాంగ్రెస్, వైసీపీ, టీడీపీల్లో కీలక నేతగా కొనసాగారు.

1978లో జనతా పార్టీ తరఫున నాగూరు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1983, 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1989, 1991లో పార్వతీపురం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998లో టీడీపీ తరఫున పార్వతీపురం ఎంపీగా గెలుపొందారు.

1999లో నాగూరు నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయరామరాజు, 2004లో పార్వతీపురం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా, రోశయ్య మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

2017లో టీడీపీ తరఫున శ్రీకాకుళం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దశాబ్దాల రాజకీయ జీవితంలో వివిధ పార్టీల తరఫున ప్రజాప్రతినిధిగా, మంత్రిగా సేవలందించిన శత్రుచర్ల విజయరామరాజు మరణంతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడిని కోల్పోయినట్లయింది.

Join WhatsApp

Join Now

Leave a Comment