హైదరాబాద్ నగరంలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక ‘భారత్ సమ్మిట్-2026’కు(Bharat Summit-2026) సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఈ సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka)తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విద్వేష రాజకీయాలు, సామాజిక విభజన పెరుగుతున్న తరుణంలో ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల భావాలు(Progressive Ideologies) కలిగిన వారిని ఒకే వేదికపైకి తెచ్చి నూతన దిశానిర్దేశం చేయడమే ఈ సమ్మిట్ ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమానికి 70కి పైగా దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రజాప్రతినిధులు, విధాన రూపకర్తలు, మేధావులు హాజరుకానున్నారు.
మహాత్మా గాంధీ(Mahatma Gandhi) బోధించిన అహింసా మార్గం, నెహ్రూ(Jawaharlal Nehru) ప్రవచించిన అలీన విదేశాంగ విధానం, మిశ్రమ ఆర్థిక విధానాల ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ సదస్సు సాగనుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో(Democracy) అధికార, ప్రతిపక్షాలు శత్రువులు కాదని, కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని స్పష్టం చేశారు. భిన్నాభిప్రాయాలను గౌరవిస్తూ ప్రతిపక్షాల గొంతుకను పరిరక్షించడమే అసలైన ప్రజాస్వామ్య సూత్రమని పేర్కొంటూ, అన్ని పార్టీల నాయకులను ఈ చర్చకు ఆహ్వానించారు. ఆర్థిక విధానాలకు దావోస్(Davos) వేదికైనట్లే, సామాజిక-రాజకీయ చర్చలకు హైదరాబాద్ అంతర్జాతీయ వేదికగా మారనుందని తెలిపారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం, నెహ్రూ జయంతి వేళ జరుగుతున్న ఈ సమ్మిట్‌ను విజయవంతం చేయడానికి మీడియా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు.








