గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) ఎన్నికల వేళ జనసేన పార్టీ (Jana Sena Party) అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు (Panchakarla Ramesh Babu) దొంగ ఓటు (Fake Vote) వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి దొంగ ఓటు వేయడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థను(Democratic System), ఎన్నికల ప్రక్రియను (Election Process) తీవ్రంగా అపహాస్యం చేస్తూ పంచకర్ల రమేష్ బాబు (Panchakarla Ramesh Babu) వేసిన ఈ “దొంగ ఓటు” (Fake Vote) రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిన పోలింగ్ పారదర్శకతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
నిబంధనల ప్రకారం పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు 117వ డివిజన్‌లో ఓటు హక్కు ఉంది. అక్కడ కూటమి అభ్యర్థిగా టీడీపీ(TDP) తరఫున పోటీ చేస్తున్న అవగడ్డ అప్పలనాయుడుకు (Avagadda Appala Naidu) ఆయన ఓటు వేయాల్సి ఉంది.
కానీ, పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి ఏకంగా 115వ డివిజన్‌లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ బ్యాలెట్ పేపర్‌పై జనసేన అభ్యర్థి సేనాపతి సోమశేఖర్‌కు (Senapati Somashekhar) ఓటు వేశారు. బ్యాలెట్ పేపర్‌పై పేరు, పార్టీ సింబల్ స్పష్టంగా ఉన్నప్పటికీ.. అవేమీ పట్టించుకోకుండా కళ్లు మూసుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు ఉన్న వార్డు ఒకటైతే.. మరో వార్డుకు వెళ్లి మరొకరికి ఓటు వేసి అడ్డంగా దొరికిపోయి తీవ్ర అబాసుపాలయ్యారు.
అయితే.. తన డివిజన్‌లో టీడీపీ(TDP) అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేక.. పక్క డివిజన్‌లో నిలబడిన జనసేన అభ్యర్థికి వెళ్లి ఓటు వేశారని జనసైనికులే ఎలివేషన్స్ ఇస్తుండడం కొసమెరుపు.
కాగా, ఎమ్మెల్యే దొంగ ఓటు భాగోతం వెనుక స్థానిక పోలింగ్ సిబ్బంది, అధికారుల పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన ఓటరు ఐడెంటిటీ, వార్డు నంబర్, ఓటర్ జాబితాలోని పేరును సరిచూసుకోవాల్సిన బాధ్యత పోలింగ్ అధికారులపై ఉంటుంది. ‘శాసనసభ్యుడు’ (Member of Legislative Assembly – MLA) అన్న ఏకైక కారణంతో ఏ ప్రాతిపదికన ఓటర్ లిస్ట్‌లో పేరు చూడకుండానే బ్యాలెట్ పేపర్ ఇచ్చేశారని విపక్షాలు, ప్రజలు నిలదీస్తున్నారు.
సామాన్య పౌరుడు చట్టాలు పాటించాలని నీతులు చెప్పే పాలకులే.. బహిరంగంగా దొంగ ఓట్లు వేస్తూ దొరికిపోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని, “చట్టాలను రక్షించాల్సిన ఎమ్మెల్యేనే ఇలా దొంగ ఓట్లు వేస్తే, ఇక ఈ స్థానిక ఎన్నికల్లో పారదర్శకత ఎక్కడ ఉంది?” అని ఓటర్లు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుపై మరియు దొంగ ఓటుకు సహకరించిన అధికారులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సుమోటోగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ తీవ్రమవుతోంది.







