“ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో మహా సంగ్రామం”

"ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో మహా సంగ్రామం"

Summarize with AI

దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఏకపక్ష తొలగింపుల రూపంలో సాగుతున్న “ఓటు చోరీ”కి నిరసనగా వచ్చే నవంబర్ 1న ఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదాన్‌లో “చలో ఢిల్లీ” మహా మార్చ్ (ఓటు బచావో – దేశ్ బచావో జన మార్చ్) నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.

ఇది కేవలం ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన నిరసన కాదని, “భారతదేశ ఆత్మను కాపాడుకునే దిశగా సాగే చారిత్రక ఉద్యమం” అని రాహుల్ గాంధీ అభివర్ణించారు.

“మన ఓట్లను బహిరంగంగా దొంగిలిస్తున్నారు. ఓటర్ల జాబితాల నుంచి అక్రమంగా పేర్లు తొలగించారు. రాజ్యాంగాన్ని, చట్టాలను విచ్చలవిడిగా ఉల్లంఘించారు. దీనిపై ప్రశ్నించిన ప్రజాస్వామ్యవాదులు, అభ్యర్థులపై పోలీసుల లాఠీలతో దాడులు చేయించారు. ఈ అరాచకాన్ని ఇక ఎంతమాత్రం మౌనంగా భరించేది లేదు. నవంబర్ 1న ఇందుకు దేశ ప్రజలే నేరుగా సమాధానం చెప్తారు” అని రాహుల్‌గాంధీ కేంద్రాన్ని హెచ్చ‌రించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ల ఏకపక్ష ధోరణులతో, నిరంకుశ పాలనతో విసిగిపోయిన పౌరులంతా ఈ మార్చ్‌లో భాగస్వాములు కావాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకునే ప్రతి ఒక్కరినీ ఈ మహోద్యమం సాదరంగా ఆహ్వానిస్తోందన్నారు.

అధికారంలో ఉన్నవారు పోలీసు బలగాలను, లాఠీలను చూపి భయపెట్టే ప్రయత్నం చేస్తారని, అయితే ఏమాత్రం భయపడకుండా దేశ ఆత్మ రక్షణ కోసం కదం తొక్కాలని ప్రజలకు ధైర్యాన్ని నూరిపోశారు.

ప్రజాసంఘాలు, విద్యార్థి లోకానికి ప్రత్యేక పిలుపు:ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేని విద్యార్థి సంఘాలు, యువత, రైతులు, కార్మికులు, మహిళలు, వ్యాపారులు ముందుకు రావాలని కోరారు. మీ స్వేచ్ఛపై, ఆలోచనలపై, భావవ్యక్తీకరణపై దాడి జరుగుతోందని భావిస్తే.. ఢిల్లీ వీధుల్లో స్వేచ్ఛా గళాన్ని వినిపించడానికి సిద్ధం కావాలన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment