నవంబరు 6, 1996.. కోనసీమ చరిత్రలో ఒక కాళరాత్రి
1996 నవంబరు 6. తూర్పుగోదావరి జిల్లాలోని(East Godavari District) కోనసీమ (Konaseema) ప్రాంతాన్ని పెను తుపాను కుదిపేసింది. గంటకు సుమారు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులు(Violent Winds), సముద్రపు ఉప్పెనతో(Storm Surge) కాకినాడకు దక్షిణంగా తీరప్రాంతం అతలాకుతలమైంది.
పచ్చని కొబ్బరి తోటలు (Coconut Groves) నేలకొరిగాయి. లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. వేలాది కుటుంబాలు తమ ఇళ్లను, పంటలను, జీవనోపాధిని కోల్పోయాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లినవారు, తీరప్రాంతాల్లో రొయ్యపిల్లలను సేకరిస్తున్న మహిళలు(Women), చిన్నారులు తుపాను బారినపడ్డారు.
అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ఉన్నారు. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేరవేయడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తుపాను అనంతరం సకాలంలో సహాయం అందించడం ప్రభుత్వ బాధ్యత(Government Responsibility). ఈ మూడు అంశాల్లోనూ 1996 తుపాను సమయంలో తీవ్రమైన లోపాలు కారణంగా అపారనష్టం వాటిల్లింది.

ఎంతోమంది మరణం.. అదృశ్యం
- 1996 తుపాను మానవ విషాదానికి సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది.
- అప్పటి ప్రభుత్వ రికార్డుల ప్రకారం 1,077 మంది మరణించినట్లు నమోదైంది. మరో 1,683 మంది అదృశ్యమైనట్లు గుర్తించారు.
- ఈ 2,760 మందిలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 1,435 మంది మత్స్యకారులు, మత్స్యకార కుటుంబాల సభ్యులు ఉన్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు.

తీర ప్రాంతాల్లో విషాదం
- మత్స్యకారులకు (Fishing Community) సంబంధించిన నష్టాన్ని పరిశీలిస్తే మరింత విషాదకరమైన పరిస్థితి కనిపిస్తుంది.
- 569 మంది సముద్రంలో మెకనైజ్డ్ బోట్లపై చేపల వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయినట్లు లేదా అదృశ్యమైనట్లు నమోదు చేశారు.
- సముద్ర తీరాలు, నదీ ముఖద్వారాల వద్ద రొయ్య పిల్లలను సేకరిస్తున్న 830 మంది తుపాను ఉప్పెనకు బలయ్యారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
- మరో 36 మంది ఇళ్లు కూలిపోవడం, చెట్లు పడిపోవడం వంటి కారణాలతో మరణించారు.
- ఈ గణాంకాలు చూస్తే తుపాను బాధితుల్లో సముద్రం, నదీముఖద్వారాల వద్ద పనిచేసే పేద మత్స్యకార కుటుంబాలే అత్యధికంగా నష్టపోయినట్లు స్పష్టమవుతోంది.
ముందస్తు హెచ్చరికలున్నా.. పట్టింపు శూన్యం
- భారత వాతావరణ శాఖ 1996 నవంబరు 5న మధ్యాహ్నం 3 గంటలకు తొలి తుపాను హెచ్చరిక జారీ చేసింది. తీరం దాటడానికి దాదాపు 30 గంటల ముందే అధికారులకు సమాచారం అందింది.
- వాతావరణ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు హెచ్చరికలు అందినా, కొన్ని అత్యంత ప్రమాదకర తీరప్రాంత గ్రామాలకు అవి చేరలేదని అధ్యయనం గుర్తించింది.
- వాతావరణ శాఖ తుపానును గుర్తించింది. కానీ ఆ సమాచారం ప్రాణాపాయంలో ఉన్న చివరి వ్యక్తికి చేరేలా చేయడంలో వ్యవస్థ విఫలమైంది.

బలుసుతిప్పలోనే 376 మంది మృతి, అదృశ్యం
- బలుసుతిప్ప గ్రామంలో(Balusutippa Village) జరిగిన నష్టం తుపాను హెచ్చరికల వ్యవస్థలోని లోపాలను స్పష్టంగా తెలియజేస్తుంది.
- ఆ గ్రామానికి చెందిన 376 మంది తుపాను కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు లేదా అదృశ్యమయ్యారు.
- వీరిలో అత్యధికంగా 331 మంది మసానితిప్ప, చిలకనపర్ర, తూర్లముండి వంటి తీరప్రాంతాల్లో రొయ్యపిల్లల సేకరణ కోసం వెళ్లినవారు.
- ఈ 331 మందిలో పెద్దసంఖ్యలో మహిళలు, బాలబాలికలు ఉన్నారు. తుపాన్ సకాలంలో హెచ్చరికలు తెలియజేసి ఉంటే, తీరప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉండేది.
తుపాను ముగిసినా.. అందని సాయం
- 1996 నవంబరు 6 రాత్రి తుపాన్ విరుచుకుపడింది. కానీ, బలుసుతిప్ప గ్రామానికి బియ్యం, కిరోసిన్, తాగునీరు వంటి అత్యవసర సహాయం కూడా చేరలేదు.
- తుపాను అనంతరం మూడు రోజులపాటు ఆ గ్రామం అత్యవసర సహాయం కోసం ఎదురుచూడాల్సి దుస్థితి.

50 లక్షల కొబ్బరి చెట్లు.. కోనసీమ ఆర్థిక వ్యవస్థకు దెబ్బ
- 1996లో చంద్రబాబు హయాంలో బీభత్సం సృష్టించిన తుపాను కోనసీమ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసింది.
- నాటి పార్లమెంటు చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అంచనాల ప్రకారం సుమారు 50 లక్షల కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయి.
- వరి పంట దెబ్బతింటే తిరిగి సాగు చేసే అవకాశం ఉంటుంది. కానీ కొబ్బరి చెట్లు నేలకూలితే వాటి స్థానంలో కొత్త చెట్లు నాటి, అవి పూర్తిస్థాయిలో దిగుబడి ఇచ్చేవరకు రైతులు సంవత్సరాలపాటు ఎదురుచూడాల్సి వస్తుంది.
- 1996 తుపాను వల్ల రైతులు ఆ ఏడాది ఆదాయాన్ని మాత్రమే కాదు, భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్నీ కోల్పోయారు.

దెబ్బతిన్న 6.48 లక్షల ఇళ్లు
అప్పటి చంద్రబాబు ప్రభుత్వ నివేదిక ప్రకారం.. తుపాను వల్ల 6,48,474 ఇళ్లు పూర్తిగా/పాక్షికంగా దెబ్బతిన్నాయి.
- వీటిలో 3,15,113 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. లక్షలాది కుటుంబాలు తమ నివాసాలను కోల్పోయాయి.
- అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దెబ్బతిన్న ఇంటికి రూ.1,000, పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ.500 మాత్రమే ఇచ్చారు.
- లక్షల ఇళ్లు దెబ్బతిన్న విపత్తులో ఈ మొత్తాలు శాశ్వత గృహ పునర్నిర్మాణానికి ఏ మేరకు సరిపోతాయి.








