రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) త్వరలో సుమారు 30,000 గ్రూప్-డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని దైనిక్ జాగరణ్ కథనం వెల్లడించింది. దీపావళికి ముందే సంక్షిప్త నోటీసు విడుదల కావచ్చని, పండుగ తర్వాత పూర్తి వివరాలతో కూడిన అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సమాచారం.
ట్రాక్ మెయింటెయినర్లు, పాయింట్స్‌మెన్ పోస్టులు
ఈ నియామకాల్లో ట్రాక్ మెయింటెయినర్లు, పాయింట్స్‌మెన్‌తో పాటు ఇతర సాంకేతిక, సాంకేతికేతర విభాగాలకు చెందిన పోస్టులు ఉండే అవకాశం ఉంది. అయితే, పోస్టుల కచ్చితమైన సంఖ్య, విభాగాల వారీగా ఖాళీల వివరాలు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టమవుతాయి. ప్రతిపాదిత నియామకాలకు సంబంధించి జోనల్ రైల్వేలు, ప్రొడక్షన్ యూనిట్ల నుంచి ఖాళీల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నవంబర్-డిసెంబర్ మధ్య ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.
గ్రూప్-డి నియామకాలకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) 2027 తొలి త్రైమాసికంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దరఖాస్తుల తేదీలు, ఖాళీల సంఖ్య, వయోపరిమితి, విద్యార్హతలు, పరీక్ష షెడ్యూల్‌పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అభ్యర్థులు తాజా సమాచారం కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) అధికారిక ప్రకటనలను పరిశీలించాలి.








