హైదరాబాద్‌లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. భోపాల్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ప్రైవేట్ ప్రయాణికుల బస్సులో తనిఖీలు నిర్వహించి, సుమారు రూ.1.1 కోట్ల విలువైన 1.136 కిలోల మెథాంఫెటమిన్‌ను గుర్తించారు. DRI హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు పక్కా నిఘా సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. బస్సులోని స్లీపర్ బెర్త్‌ల పరుపుల కింద దాచిన నాలుగు ప్యాకెట్లను గుర్తించి, ఫీల్డ్ టెస్టింగ్ కిట్‌తో పరీక్షించగా అందులో నిషేధిత మెథాంఫెటమిన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ప్రాథమిక విచారణలో, ఆ బెర్త్‌లలో ప్రయాణించిన వ్యక్తులు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బస్సు ఎక్కి, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. వారు దిగిపోయిన తర్వాత డ్రగ్స్ ప్యాకెట్లు బస్సులోనే ఉండిపోవడంపై దర్యాప్తు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న 1.136 కిలోల మెథాంఫెటమిన్‌ను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం, 1985 కింద సీజ్ చేశారు. ఈ మాదకద్రవ్యాలను ఎవరు సరఫరా చేశారు? హైదరాబాద్‌లో ఎవరికి చేరవేయాలని భావించారు? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








