రాజకీయాల్లో పదవుల కోసం నాయకులు ఎంత దూరమైనా వెళ్తారనడానికి నిదర్శనంగా నిలిచిన ఒక ఆసక్తికర ఘటన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వెలుగు చూసింది. మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఆశతో, మరో ఆరు నెలల్లో జరగాల్సిన ప్రేమ వివాహాన్ని ముహూర్తాలు కూడా చూసుకోకుండా రాత్రికి రాత్రే జరిపించుకున్న ఒక యువ టీడీపీ నేతకు చివరికి తీవ్ర నిరాశే ఎదురైంది. కూటమి పొత్తుల లెక్కల్లో ఆ సీటు జనసేనకు కేటాయించడంతో ఆ యువనేత ఆశలు పూర్తిగా ఆవిరైపోయాయి.
అసలు ఏం జరిగింది?
సాలూరుకు చెందిన టీడీపీ యువ నాయకుడు, మాజీ కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్. మున్సిపల్ ఎన్నికల్లో సాలూరు చైర్పర్సన్ స్థానాన్ని ‘బీసీ మహిళ’కు కేటాయిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. దీంతో హర్షవర్ధన్ ఆలోచనలో పడ్డారు.
గత ఎనిమిదేళ్లుగా గుళ్ల మంజీర అనే యువతితో ప్రేమలో ఉన్న ఆయన.. మరో ఆరు నెలల తర్వాత వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ, రిజర్వేషన్ల ప్రకటన వెలువడిన వెంటనే.. తన భార్యను బరిలో దింపితే చైర్పర్సన్ పదవి తమ కుటుంబానికే దక్కుతుందని భావించి, ఎవరికీ చెప్పకుండా గుడిలో హడావుడిగా మంజీరను పెళ్లి చేసుకున్నాడు. రిజర్వేషన్లు వచ్చిన కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ పెళ్లి జరిగిపోవడం గమనార్హం.
కూటమి పొత్తులో ఊహించని షాక్
ఎన్నికల కోసం ముహూర్తాలు కూడా లెక్కపెట్టకుండా చేసుకున్న ఈ ప్రేమ వివాహం ద్వారా భార్యకు టికెట్ ఇప్పించి గెలిపించుకోవాలని హర్షవర్ధన్ గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, కూటమి పార్టీల మధ్య జరిగిన సీట్ల సర్దుబాటులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ స్థానాన్ని టీడీపీ అధిష్టానం పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించింది. దీంతో హర్షవర్ధన్ ప్లాన్ తలకిందులైంది. పదవి కోసం తాపత్రయపడి హడావుడిగా పెళ్లి చేసుకున్నప్పటికీ, చివరికి ఆ స్థానమే కూటమి భాగస్వామ్య పార్టీకి వెళ్లడంతో ఆయన ఆశలు గాల్లో కలిసిపోయాయి. రాజకీయాల కోసం ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే చివరికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేదానికి ఈ ఉదంతం నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.








