ఇండియా కూటమి నిరసనలపై కిషన్‌రెడ్డి ఫైర్

ఇండియా కూటమి నిరసనలపై కిషన్‌రెడ్డి ఫైర్

Summarize with AI

ఢిల్లీలో ఇండియా కూటమి పేరుతో గత వారం రోజులుగా జరుగుతున్న నిరసనలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ స్పీకర్, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, వరుస ఎన్నికల ఓటములకు ఎన్నికల సంఘాన్ని బాధ్యుడిగా చేయడం సరికాదని అన్నారు. భారత్ ఏమైనా సోనియా కుటుంబం ప్రైవేట్ ఆస్తా? అంటూ ప్రశ్నించారు.

ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని ఆరోపిస్తే ఆధారాలు చూపించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సర్‌ (SIR) ప్రక్రియలో సుమారు 2.80 కోట్ల మంది మరణించినట్లు గుర్తించారని, ఆరు కోట్ల మంది ఓటర్లు నివాసాలు మారారని, కోటి మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత లేని ఓట్లను తొలగించడం, జాబితాలో తప్పులను సరిచేయడం ఎన్నికల ప్రక్రియలో భాగమని వివరించారు. ఓటర్ల పేర్లు తొలగించారని చెబుతున్న కాంగ్రెస్.. బాధితుల వివరాలు, ఆధారాలను ప్రజల ముందుంచాలని సవాల్ విసిరారు. అధికారులతో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారంటూ చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని విమర్శించారు.

కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఓటములను ఎదుర్కొంటోందని, అందుకు ఎన్నికల సంఘాన్ని నిందించడం తగదని కిషన్‌రెడ్డి అన్నారు. 2014లో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు ప్రస్తుత ఎన్నికల సంఘం అధికారులు, SIR ప్రక్రియ లేవని గుర్తుచేశారు. తమిళనాడులో SIR తర్వాత బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలిచిందని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలపై బురదజల్లడం, నిరసనలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడం మానుకోవాలని హితవు పలికారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment