55 రోజులుగా కాకినాడ తీరంలో నిలిచిపోయిన ‘స్టెల్లా ఎల్’ నౌక ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈరోజు తెల్లవారుజామున నౌక పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కొటోనౌ పోర్టుకు బయలుదేరింది. కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో పాటు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ షిప్ బయల్దేరేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో ‘స్టెల్లా ఎల్’కు 55 రోజుల తరువాత మోక్షం లభించినట్లయింది.
2024 నవంబర్ 11న హల్దియా నుండి కాకినాడకు వచ్చిన ఈ నౌకలో 32,415 టన్నుల లోడింగ్ పూర్తయిన తరువాత నవంబర్ 27న అధికారులు తనిఖీ చేయగా, నౌకలో పీడీఎస్ రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. డిసెంబర్ 4న మరొకసారి తనిఖీ చేయగా, బియ్యంలో 36 శాతం ఫోర్టిఫైడ్ కర్నెల్స్ ఉన్నట్లు తేలింది. ఈ వ్యవహారంలో నౌకకు సంబంధిత సత్యం బాలాజీ ఇండస్ట్రీస్ ఓనర్ ప్రదీప్ అగర్వాల్, మేనేజర్ కళ్యాణ్ అశోక్‌లపై కేసులు నమోదు చేశారు.
డిసెంబర్ 30న 1,320 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి, గోదాముల్లోకి తరలించారు. ఎగుమతిదారుల అభ్యర్థన మేరకు మిగిలిన బియ్యాన్ని నౌకలో లోడ్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. షిప్ నిలిపినందుకు చెల్లించాల్సిన యాంకరేజి చార్జి, ఎక్స్‌పోర్టు రుసుములు పూర్తిగా చెల్లించి నోడ్యూస్ ధ్రువీకరణ పొందిన తర్వాత, నౌక కస్టమ్స్ అధికారుల క్లియరెన్స్ పొందింది. చివరకు పశ్చిమ ఆఫ్రికా వైపు ఈరోజు ఉదయం బయల్దేరింది. యాంకరేజి సమస్యలు మరియు రేషన్ బియ్యం వివాదం కాకినాడ ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.








