దేశవ్యాప్తంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకుంటోంది. నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణం(Question Paper Leak Scam), ప్రత్యర్థుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న భారీ టోకు తొలగింపు (SIR) వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వానికి మాయని మచ్చలా మారుతున్నాయి. బీజేపీ రాజకీయ లబ్ధికే ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) నేతృత్వంలో ఈ తంతు నడుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా బీజేపీ(BJP) వ్యతిరేక ఓట్లుగా భావిస్తూ ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు, దళితుల ఓట్లను పెద్దఎత్తున తొలగించారనే విపక్షాల ఆరోపణలకు బలమైన ఆధారాలున్నాయి. ఈ అంశంపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పది నెలల్లో ఏకంగా 14 సార్లు అభ్యంతరాలు చెబుతూ లేఖలు రాసినా సీఈసీ పట్టించుకోకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. మెజారిటీ అభిప్రాయాన్ని విస్మరించి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై సుప్రీంకోర్టులోనూ విచారణ సాగుతోంది.
ఇండియా కూటమి (INDIA Alliance) నిరసనలు, సీజేపీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద ఆందోళన పిలుపుతో ఢిల్లీని (Delhi) భద్రతా బలగాలతో నిర్బంధించారు. ఈ తీవ్ర పరిణామాలపై ప్రధాని మోదీ కానీ, విమర్శలు ఎదుర్కొంటున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కానీ నోరు మెదపడం లేదు. అయితే, రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెప్పే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) మాత్రం రంగంలోకి దిగి మోదీ సర్కార్‌కు వకాల్తా పుచ్చుకున్నారు.
సీజేపీ ఆందోళనలపై స్పందించిన వెంకయ్య నాయుడు.. నిరసన తెలిపే హక్కుందంటూనే, గతంలో నీట్ ఆందోళనల్లో పోలీసులపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఓట్ల తొలగింపు ఆరోపణలు కేవలం అపోహ మాత్రమేనని కొట్టిపారేస్తూ, సీఈసీ రాజీనామా డిమాండ్ అసంబద్ధమన్నారు. ఈవీఎంలను నిందించడం హాస్యాస్పదమని, సీఈసీ నియామక కమిటీలో ప్రధానన్యాయమూర్తి (CJI) ఉండటం సరైంది కాదంటూ తనలోని బీజేపీ అభిమానాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు.
అయితే, దేశంలో నీట్ పేపర్ లీక్ అయినప్పుడు, లక్షలాది మంది ప్రజలు ఓటు హక్కు కోల్పోయి లబోదిబోమంటున్నప్పుడు స్పందించని వెంకయ్య నాయుడు (Venkaiah Naidu). మోదీ ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం హుటాహుటిన మీడియా ముందుకు వచ్చి నీతులు వల్లిస్తున్నారని నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిందితులు సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటే, పెద్దలు వచ్చి వెనకేసుకురావడం ద్వారా అనుమానాలు మరింత బలపడుతున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి.








