విజయవాడ నగరంలో మహిళలపై జరుగుతున్న దాడుల పరంపర స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. మొన్న ప్రేమోన్మాది చేతిలో యువతి, నిన్న అరండల్‌పేటలో సునీత అనే మహిళ దారుణ హత్య, ఇవాళ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యపై ఓ భర్త కత్తితో కిరాతకంగా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
సంఘటన వివరాలు
విజయవాడ వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే మహిళ స్థానిక ప్లాస్టిక్ దుకాణంలో పనిచేస్తోంది. గురువారం రోజున ఆమె విధుల్లో ఉండగా, భర్త వీరాంజనేయులు అక్కడికి చేరుకున్నాడు. కొంతసేపు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన వీరాంజనేయులు, తన వెంట తెచ్చుకున్న కత్తితో భార్య లక్ష్మి ముఖం, మెడ, భుజ భాగాలపై తీవ్రంగా పొడిచి దాడులు చేశాడు.
భర్త జరిపిన దాడితో బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు, తోటి వ్యాపారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావమవుతున్న లక్ష్మిని హుటాహుటిన విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పరారీలో ఉన్న నిందితుడు వీరాంజనేయులు కోసం గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.
పట్టపగలే నడిరోడ్డులో భార్యపై భర్త కత్తితో దాడికి పాల్పడిన తీరుతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయవాడ నగరంలో వరుసగా మహిళలపై దాడి జరుగుతుండడంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మహిళా రక్షణ కోసం వెంటనే స్పందించేలా గతంలో మాదిరి దిశ యాప్.. దిశ పోలీస్ స్టేషన్లు, 24 గంటలూ పోలీస్ పహారా వంటి చర్యలు లేకపోవడం వల్లే నేరాలు పెరిగిపోతున్నాయంటున్నారు.








