మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు (Murder Case) మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) కుమార్తె వైఎస్ సునీత (YS Sunitha) ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ముఖ్యమంత్రితో సామాన్య ప్రజాప్రతినిధులు, మంత్రులకే సులభంగా అపాయింట్‌మెంట్ దొరకని పరిస్థితుల్లో, సునీత వరుసగా చంద్రబాబును పదే పదే ఎలా కలుస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి(YS Avinash Reddy) ఈడీ నోటీసులు (ED Notices) జారీ చేసిన నేపథ్యంలోనే ఈ భేటీ జరిగిందని వార్తలు రావడంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసు దర్యాప్తును చంద్రబాబు తన కనుసన్నల్లోనే నడిపిస్తున్నారని, ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తూ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా ట్రయల్ పూర్తి చేయడంపై దృష్టి పెట్టకుండా, ఈ కేసును రాజకీయ అస్త్రంగా మార్చారని ప్రతిపక్ష వర్గాలు మండిపడుతున్నాయి.
వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న దస్తగిరి(Dastagiri), సునీల్ యాదవ్ (Sunil Yadav) వంటి వారితో చంద్రబాబు, సునీత వ్యవహరిస్తున్న తీరును విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. వివేకాను గొడ్డలితో తానే నరికి చంపానంటూ బహిరంగంగా ప్రకటించిన అప్రూవర్ దస్తగిరి, తన భార్యతో కలిసి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ కావడం తీవ్ర దుమారం రేపింది.
మీడియా సమావేశాల్లో సునీత గొప్పగా పోరాడుతోందంటూ దస్తగిరి పొగడ్తలు కురిపించడం చూసి ప్రజలు విస్తుపోతున్నారు. మరోవైపు రెండో నిందితుడైన సునీల్ యాదవ్ తాను రాజకీయాల్లోకి వస్తానని వ్యాఖ్యానించడం గమనార్హం.
తామే స్వయంగా వివేకాను చంపామని అంగీకరించిన ముద్దాయిలకు టీడీపీ(TDP) అండదండలు లభిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు సాధారణ ఆర్థిక పరిస్థితిలో ఉన్న ఈ నిందితులు ఇవాళ కాన్వాయ్‌లలో తిరుగుతూ దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సునీత ఇప్పటివరకు 15కు పైగా పిటిషన్లు వేసినప్పటికీ, అసలు హత్య చేసినట్లు ఒప్పుకున్న దస్తగిరి, సునీల్ యాదవ్ వంటి వారి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఒక్క పిటిషన్ కూడా వేయకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే పాలనాపరమైన వైఫల్యాలతో, రాజకీయ ఒత్తిడితో ఆపదలో పడుతుందో అప్పుడు సరిగ్గా అదే సమయంలో వివేకా హత్య కేసు అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించడం ఒక అలవాటుగా మార్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








