నిరుపేద విద్యార్థులపై చంద్రబాబు ప్రభుత్వం దెబ్బ!

నిరుపేద విద్యార్థులపై చంద్రబాబు ప్రభుత్వం దెబ్బ!

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద వర్గాలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ విద్యావ్యవస్థను చిన్నచూపు చూస్తూ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల నడుములు విరుస్తుంటే, వాటిని అరికట్టాల్సిన బాధ్యతను పక్కనపెట్టి.. ప్రైవేట్ స్కూళ్ల ఏర్పాటుకు ఉన్న అరకొర నిబంధనలను కూడా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది.

అడ్డగోలుగా నిబంధనల రద్దు
గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ఏదైనా ప్రాంతంలో ప్రైవేటు పాఠశాల ఏర్పాటు చేయాలంటే అక్కడ సర్వే జరిపి, ఇప్పటికే ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలల వివరాలు సేకరించాల్సి ఉండేది. కొత్త పాఠశాల అవసరమని ఆధారాలతో నిరూపిస్తేనే అనుమతులు లభించేవి. కానీ, ఈ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఏపీ విద్యా చట్టం-1982లోని పలు కీలక సెక్షన్లను (20, 33-బి) సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి వెల్లడించారు. ఈ నిర్ణయంతో ప్రైవేట్ స్కూళ్లు పుట్టగొడుగుల్లా వెలిసి, ఇప్పటికే అరకొర వసతులతో ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉనికిని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాటి విప్లవాత్మక మార్పులు మటుమాయం
గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సర్కారు బడుల ముఖచిత్రమే మారిపోయింది. ఈ మార్పును దేశ‌మే ప్ర‌శంసించింది. నిరుపేద కుటుంబాల పిల్లలు చదువుకుంటేనే ఆ పేదరికం నుంచి బయటపడతారని నమ్మి విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.

  • నాడు-నేడుతో పాఠశాలల ఆధునీకరణతో ప్రైవేట్ బడులకు దీటుగా డిజిటల్ తరగతులు, మౌలిక సదుపాయాలు కల్పించారు.
  • అమ్మఒడితో పిల్లలను బడికి పంపే తల్లి ఖాతాలో ఆర్థిక సాయం అందించడమే కాకుండా.. పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, షూ, బెల్ట్ సహా 9 రకాల వస్తువులతో ‘విద్యా కానుక’ అందించారు.
  • బైజూస్ కంటెంట్‌తో 8వ తరగతి నుంచి ఆపై త‌ర‌గ‌తుల విద్యార్థులకు ఉచితంగా టాబ్‌లు ఇస్తూ, ఇంగ్లీష్ మీడియం విద్యను అందుబాటులోకి తెచ్చారు. ‘గోరుముద్ద’ ద్వారా పౌష్టికాహారాన్ని అందించార‌నేది సగటు పౌరులు అంగీకరించాల్సిన సత్యం.

కూటమి పాలనలో ‘పేర్లు మార్పు – పథకాలకు కోత’!
ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో తెచ్చిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చడానికే ప్రాధాన్యత ఇచ్చిందే తప్ప, క్షేత్రస్థాయిలో నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. పథకాలను అరకొరగా అమలు చేస్తూ, మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎర్రవాకిళ్లు పరుస్తూ.. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు మండిపడుతున్నారు.

ప్ర‌భుత్వ విద్య‌ను బ‌లోపేతం చేయాల్సిన బాధ్య‌త‌ను మ‌రిచి ప్రైవేట్ విద్యాకు ప్రాధాన్య‌త‌నిస్తూ నిరుపేద విద్యార్థుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం నాణ్య‌మైన విద్య‌ను దూరం చేస్తోంద‌ని విద్యావేత్త‌లు, త‌ల్లిదండ్రులు మండిప‌డుతున్నారు. అనాలోచిన నిర్ణ‌యాల వ‌ల్ల‌ రాష్ట్రంలో నిర‌క్ష‌రాస్యుల శాతాన్ని పెంచ‌డంతో పాటు ఫీజుల భారంతో స‌గ‌టు మ‌ధ్య త‌ర‌గ‌తి త‌ల్లిదండ్రుల‌పై న‌డ్డివిరిచి పేద‌రికం వైపు మ‌ళ్లేలా చేస్తోంద‌ని మండిప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment