భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు ఫార్మాట్లలో టీమిండియా(Team India) కెప్టెన్సీ(Captaincy) బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2016లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హర్మన్‌ప్రీత్.. దాదాపు దశాబ్దకాలం భారత జట్టుకు నాయకత్వం వహించారు. ఆమె కెప్టెన్సీలో భారత జట్టు ఎన్నో కీలక విజయాలు సాధించింది.
ముఖ్యంగా గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి మహిళల ప్రపంచ టైటిల్ (Women’s World Title) అందించడంతో పాటు, ఆసియా క్రీడల్లో వరుసగా స్వర్ణ పతకాలు సాధించిన జట్టుకు ఆమె నాయకత్వం వహించారు. కెప్టెన్సీకి వీడ్కోలు పలికినా.. ఇకపై ఆటగాడిగా కొనసాగుతూ బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టనున్నట్లు హర్మన్‌ప్రీత్ స్పష్టం చేశారు.
భారత మహిళల జట్టు భవిష్యత్ ప్రణాళికపై చర్చించేందుకు బీసీసీఐ(BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా(Devajit Saikia) ఆధ్వర్యంలో గువాహటిలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana), హెడ్ కోచ్ అమోల్ ముజుమ్దార్ (Amol Muzumdar) హాజరయ్యారు. సమావేశం జరిగిన మరుసటి రోజే హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ఈ నిర్ణయం ఆమె స్వయంగా తీసుకున్నదా, లేక బీసీసీఐ సూచనతో తీసుకున్నదా అనే విషయం స్పష్టంగా తెలియలేదు. తన నిర్ణయంపై సోషల్ మీడియాలో స్పందించిన హర్మన్‌ప్రీత్.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అంత సులభమైన నిర్ణయం కాదని, ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలు ఈ నిర్ణయంతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. జట్టు ప్రయోజనాల కోసం తన వ్యక్తిగత ప్రదర్శన, ఆశయాలను కూడా పలుమార్లు పక్కన పెట్టానని తెలిపారు.
కెప్టెన్‌గా తాను తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక జట్టు ప్రయోజనమే ఉందని హర్మన్‌ప్రీత్ స్పష్టం చేశారు. కొన్ని నిర్ణయాలు అందరికీ అర్థం కాకపోయినా, జట్టును మెరుగ్గా తీర్చిదిద్దడం, యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం, వారిలో ఆత్మవిశ్వాసం పెంచడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కొంతకాలంగా ఆమె కెప్టెన్సీతో పాటు బ్యాటర్‌గా ప్రదర్శనపై కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడం భారత మహిళల క్రికెట్‌లో కీలక మార్పుగా మారింది. తదుపరి కెప్టెన్‌గా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ, అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది. హర్మన్‌ప్రీత్ నాయకత్వ శకం ముగియడంతో భారత మహిళల జట్టు కొత్త కెప్టెన్‌తో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది.








