ఏపీలో ‘అర్ధరాత్రి’ వింత ఓటింగ్.. ఈసీకి కేంద్రమంత్రి భ‌ర్త స‌వాల్‌

ఏపీలో ‘అర్ధరాత్రి’ వింత ఓటింగ్.. ఈసీకి కేంద్రమంత్రి భ‌ర్త స‌వాల్‌

Summarize with AI

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Andhra Pradesh Assembly Elections) పోలింగ్ సరళిపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) భర్త పరకాల ప్రభాకర్(Parakala Prabhakar) లేవనెత్తిన సాంకేతిక ప్రశ్నలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో టీడీపీ(TDP) నేతృత్వంలోని కూటమి 164 స్థానాల్లో సాధించిన విజయం వెనుక, పోలింగ్ రోజు అర్ధరాత్రి వేళ అకస్మాత్తుగా పెరిగిన ఓటింగ్ శాతాలు (Voting Percentages) తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన ఆధారాలతో సహా సవాల్ విసిరారు. సామాన్య మానవ మాత్రులకు, లభ్యమయ్యే సాంకేతిక వ్యవస్థకు ఏమాత్రం సాధ్యంకాని వేగంతో ఓటింగ్ ఎలా జరిగిందో జవాబు చెప్పాలని ఎన్నికల సంఘాన్ని ఆయన నిలదీశారు.

అర్ధరాత్రి వేళ లక్షలాది ఓట్లు!
పోలింగ్ రోజు (మే 13, 2024) సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాలలోని వ్యత్యాసాలను పరకాల ప్రభాకర్ (Parakala Prabhakar) ఎండగట్టారు. పోలింగ్ ముగిసే సమయానికి సీఈవో (AP) వెల్లడించిన ప్రకారం ఓటింగ్ 68.04%. రాత్రి 8:00 గంటలకు ఈసీ(EC) విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో ఇది 68.12%గా నమోదైంది. అంటే మూడొందల నిమిషాల్లో పెరిగిన ఓటింగ్ కేవలం 0.08% (సుమారు 33,064 ఓట్లు) మాత్రమే.

  • రాత్రి 11:45 గంటల ప్రకటనలో ఓటింగ్ శాతం ఒక్కసారిగా 76.50%కి పెరిగింది. కేవలం 3 నుంచి 4 గంటల వ్యవధిలోనే ఏకంగా 34,63,767 ఓట్లు (8.38%) అదనంగా వచ్చి చేరాయి.
  • ఆ తర్వాత తుది గణాంకాల్లో ఓటింగ్ శాతాన్ని 81.86%గా ఖరారు చేశారు. 11:45 PM తర్వాత, దాదాపు 3,500 పోలింగ్ కేంద్రాల్లోనే మరో 17,19,482 ఓట్లు పెరగడం విస్తుగొలుపుతోంది.
  • మొద‌ట చెప్పిన 68.04% నుంచి చివరికి తేలిన 81.8% వరకు.. మొత్తంగా 12.54% ఓటింగ్ (51,83,249 ఓట్లు) పోలింగ్ సమయం దాటిన తర్వాత చేరడంపై దేశవ్యాప్తంగా విస్మయం వ్యక్తమవుతోంది.

ప్రతి 20 సెకన్లకో ఓటు.. మ‌నిషికి ఇది సాధ్యమేనా..?
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,500 బూత్‌లలో రాత్రి వేళ జరిగిన ఈ ఓటింగ్ వేగాన్ని లెక్కిస్తే విస్మయపరిచే నిజాలు బయటపడుతున్నాయని పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. రాత్రి 11:45 నుండి 2:00 గంటల మధ్య ఈ 3,500 బూత్‌లలో ప్రతి బూత్‌కు సగటున 491 ఓట్లు పడ్డాయి. అంటే నిమిషానికి 3.6 మంది ఓటర్లు ఓటు వేశారు. లెక్కిస్తే.. ప్రతి 20 సెకన్లకు ఒక ఓటు చొప్పున గంటల తరబడి పడుతూనే ఉంది. సాయంత్రం 5 గంటల ముందు వరకు ఒక బూత్‌లో గంటకు సగటున పడిన ఓట్లు కేవలం 60.7 మాత్రమే కావడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) అసెంబ్లీ(Assembly), లోక్‌సభలకు (Lok Sabha) సమాంతరంగా ఓటింగ్ జరిగింది. ఓటరు ఐడీ తనిఖీ, సిరా గుర్తు వేయడం, రెండు ఓట్లు వేయడం దాటి వివిపాట్ (VVPAT) స్లిప్ ప్రింట్ అయి కింద పడటానికి మాత్రమే 14 సెకన్లు పడుతుంది. ప్రింటింగ్‌కే 14 సెకన్లు పడితే, మిగిలిన 6 సెకన్లలో ఐడెంటిటీ వెరిఫికేషన్, ఇన్కింగ్, అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్లు వేయడం ఏ రకంగానూ సాధ్యం కాదని ఆయన నిరూపించారు.

ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకం
కేంద్ర ఆర్థిక మంత్రి భర్తే స్వయంగా ఈ స్థాయిలో ఆధారాలతో సహా సవాలు విసరడంతో, ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓట్ల లెక్కింపు మరియు ఓటింగ్ నమోదు వేగం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏమిటో, ఈ రకమైన ‘అర్ధరాత్రి వింతలు’ ఏ విధంగా సంభవించాయో కేంద్ర ఎన్నికల సంఘం దేశ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment