ఎన్నికల (Elections) సమయంలో సంపద (Wealth) సృష్టిస్తా.. పేదవాడిని (Poor Person) కోటీశ్వరుడిని చేస్తానని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Chandrababu).. అధికారంలోకి వచ్చాక సంపద మాట అటుంచి 27 నెలల్లోనే రూ.4 లక్షల కోట్ల అప్పులు (Debts) చేసి రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘనత చాలదన్నట్టు.. తాజాగా ప్రజాధనంతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్(Social Media Influencers) ద్వారా ప్రచారం చేసుకునేందుకు సిద్ధపడడం విమర్శలకు దారితీస్తోంది.
సంక్షేమ పథకాలు (Welfare Schemes) అమలు చేయడంలో చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Government).. ప్రజాధనంతో తన ఇమేజ్ పెంచుకునేందుకు, సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తించేందుకు కొత్త దారులు వెతుక్కుంటోంది. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన G.O.Ms.No.197ని అమల్లోకి తీసుకురావడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఉన్న సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR)ను పక్కనబెట్టి, సొంత పార్టీకి చెందిన కంటెంట్ క్రియేటర్లకు (Content Creators) ఖజానా సొమ్మును దోచిపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక మేధావులు మండిపడుతున్నారు.
అప్పుల ఊబిలో రాష్ట్రం..
కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చాక రూ. 4 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని గణాంకాలు చెబుతున్నాయి. ఒకవైపు ప్రజలకు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి నిధులు లేవంటూ చేతులెత్తేస్తున్న చంద్రబాబు.. మరోవైపు ప్రభుత్వ ప్రచారం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండడం ప్రజలను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
నిజమైన అభివృద్ధిని, సంక్షేమాన్ని పక్కనపెట్టి, గ్రాఫిక్స్ వీడియోలు, ఏఐ పోస్టులతో ప్రజలను భ్రమల్లో ముంచెత్తేందుకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు పారితోషికాలుగా(Remuneration) కట్టబెడుతున్నారనే చర్చ జరుగుతోంది.
క్యాటగిరీ-A నుండి D వరకు విభజించి ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు నెలకు గరిష్టంగా రూ. 75,000 వరకు ప్రజాధనం నుంచి పారితోషికంగా చెల్లించేందుకు మార్గదర్శకాలు తయారు చేయడం వెనుక ఉన్న దురుద్దేశం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఐ-టీడీపీ (I-TDP) బ్యాచ్‌కు దొడ్డిదారిన ప్రజాధనం మళ్లించేందుకు ప్లాన్ చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే వ్యవస్థలు ఉండగా..
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రంలో ఇప్పటికే అధికారిక సమాచార ప్రచార వ్యవస్థ (I&PR), ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ అందుబాటులో ఉన్నాయి. అధికార పార్టీకి, టీడీపీ సోషల్ మీడియా విభాగానికి అనుకూలంగా పనిచేసే వారిని ‘ఇన్‌ఫ్లుయెన్సర్లు’ అనే ముసుగులో ఎంప్యానెల్ చేసుకుని, వారికి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు/పారితోషికాలు చెల్లించేందుకు ఈ జీవో తెచ్చారని స్పష్టమవుతోందంటున్నారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులు (Common Cause), ఈ పాలసీలోని నిబంధనల ప్రకారం ప్రజాధనంతో చేసే ప్రచారం రాజకీయ తటస్థంగా (Non-partisan), పారదర్శకంగా ఉండాలి. కానీ, ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లేకుండా, తమ భజన బృందానికే ఈ చెల్లింపులు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ప్రజాధనానికి లెక్క చెప్పాల్సిందే!
ప్రభుత్వం ప్రజాధనంతో చేపడుతున్న ఈ ‘సోషల్ మీడియా సర్కస్’పై ప్రజలు, విపక్షాలు అనేక ప్రశ్నలు గుప్పిస్తున్నాయి ఎంప్యానెల్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్ల జాబితా, వారికి ఇచ్చిన చెల్లింపుల లెక్కలను ప్రభుత్వం బహిరంగంగా ఎందుకు ఉంచడం లేదు? ప్రచారానికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత? దీని వల్ల ప్రజలకు జరిగే అదనపు మేలు ఏంటి? ఇప్పటికే అప్పుల భారంతో కూరుకుపోయిన రాష్ట్రంలో, కేవలం పార్టీ ప్రచారం కోసం ప్రైవేట్ వ్యక్తులకు నెలకు లక్షలాది రూపాయలు కట్టబెట్టడం ప్రజాధనాన్ని చట్టబద్ధంగా దోపిడీ చేయడం కాదా? అని ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రచార ఆర్భాటాలు, గ్రాఫిక్స్ పోస్టులతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.








