తెలంగాణ అసెంబ్లీ ఎనిమిదో సెషన్ ప్రారంభమైన సెప్టెంబర్ 7న అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలన, ఎన్నికల హామీల అమలుపై నిరసనగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్లగా.. వారిని పోలీసులు అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మధ్య తోపులాట జరిగింది. మాజీ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి సహా పలువురు మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారని బీఆర్‌ఎస్ ఆరోపించింది. కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తదితర నేతలు కూడా ఈ ఘటనలో పాల్గొన్నారు. మహిళా ఎమ్మెల్యేలు పోలీసుల ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించి, వారిపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను డీజీపీ స్పీకర్ ముందు ఉంచాలని కోర్టు సూచించింది. అయితే ఎమ్మెల్యేలను అడ్డుకోవడం స్పీకర్ ఆదేశాల మేరకే జరిగి ఉంటే.. అసెంబ్లీ నిబంధనల అమలు, ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ పరిధిలోనే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. మహిళా ఎమ్మెల్యేలు పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆధారాలు లేవని కూడా కోర్టు పేర్కొంది. ఘటన అసెంబ్లీ వెలుపల లేదా గేటు వద్ద జరిగి ఉంటే దానికి సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.








