జనసేన అస్త్రంతో బాబు సరికొత్త పొలిటికల్ స్కెచ్?

జనసేన అస్త్రంతో బాబు సరికొత్త పొలిటికల్ స్కెచ్?

Summarize with AI

తెలుగుదేశం పార్టీలో(Telugu Desam Party) సీనియర్లు, తిరుగుబాటు గళం వినిపిస్తున్న సొంత నేతలకు చెక్ పెట్టేందుకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.

మిత్రపక్షమైన జనసేన పార్టీని (Jana Sena Party) ఆయుధంగా మలచుకుని, పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన కీలక నాయకులకు, సొంత బంధువులకు పొగబెట్టేందుకు బిగ్ ప్లాన్ సిద్ధం చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నారా లోకేష్ (Nara Lokesh) భవిష్యత్ రాజకీయం సునాయాసంగా సాగడానికే చంద్రబాబు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఉండిలో రఘురామపై..

ఇటీవల కాలంలో పార్టీ నిర్ణయాలపై, ముఖ్యంగా నారా లోకేష్ ఆదేశాల‌కు వ్య‌తిరేకంగా తనదైన శైలిలో అసంతృప్తి వెళ్లగక్కుతున్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు (Raghurama Krishnam Raju) పొగబెట్టేందుకు పక్కా స్కెచ్ సిద్ధమైంది. ఉండి నియోజకవర్గంలో రఘురామ ప్రాభవాన్ని తగ్గించేందుకు జనసేన నాయకుడు మంతెన నరసింహరాజును (Manthena Narasimha Raju) రంగంలోకి దించుతున్నారు. కూటమి పొత్తు పేరుతో జనసేన ద్వారా రఘురామకు రాజకీయంగా చెక్ పెట్టాలనేది ఈ వ్యూహంలో ప్రధాన భాగంగా రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

తునిలో యనమలకు చెక్
టీడీపీలో సుదీర్ఘకాలంగా చక్రం తిప్పుతున్న సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడికి (Yanamala Ramakrishnudu) కూడా స్వపక్షంలోనే గండం పొంచి ఉందనే చర్చ నడుస్తోంది. తుని రాజకీయంలో యనమల రామ‌కృష్ణుడు కుటుంబాన్ని పక్కనబెట్టేందుకు యనమల కృష్ణుడిని జనసేన వైపు పంపించేలా పావులు కదిపార‌న్న చ‌ర్చ కొన‌సాగుతోంది. జనసేన అభ్యర్థిని తుని బరిలోకి తీసుకురావ‌డంతో యనమల రామకృష్ణుడు ఇకపై నారా లోకేష్‌కు ఎటువంటి అంత‌ర్గ‌త సవాళ్లు విసిరే పరిస్థితి లేకుం‌డా చేయాలనే యోచనలో అధిష్టానం ఉందంటున్నారు.

హిందూపురంలో తప్పదా?
నారా లోకేష్‌కు కాబోయే సీఎం అభ్యర్థిగా ఎటువంటి పోటీ లేకుండా చేయాలంటే.. ఫ్యామిలీ పరంగా బలమైన వర్గం మద్దతు ఉన్న నందమూరి బాలకృష్ణకు (Nandamuri Balakrishna) కూడా చెక్ పెట్టక తప్పదనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. హిందూపురం కోటలో బాలకృష్ణ ప్రాభవాన్ని తగ్గించేందుకు వైసీపీ నుంచి వచ్చిన నవీన్ నిశ్చల్‌ను జ‌న‌సేన‌లో చేర్చారు. గతంలో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించిన సమయంలో, సొంత బావమరిది నందమూరి హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ చేయకుండా అనర్హత వేటు పడేలా చేసిన పాత చరిత్రను ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు బాలయ్య విషయంలోనూ అదే రీతిలో మైండ్ గేమ్ నడుస్తోందని అంచనా వేస్తున్నారు.

నారా లోకేష్ లైన్ క్లియర్ చేసేందుకేనా..?
పార్టీలో తిరుగులేని నాయకుడిగా లోకేష్‌ను నిలబెట్టేందుకు నేరుగా టీడీపీ నుంచి చర్యలు తీసుకుంటే ఎదురయ్యే వ్యతిరేకతను తట్టుకునేందుకు ‘జనసేన పార్టీ’ని ఒక ఫ్రంట్ గా వాడుకుంటున్నారని చ‌ర్చ జ‌రుగుతోంది. మొత్తానికి, మిత్రపక్షం జనసేనను ఉపయోగిస్తూనే, టీడీపీలోని కీలక నేతలను, కొరకరాని కొయ్యలను ఏకకాలంలో దెబ్బతీసేందుకు ఈ వ్యూహం రచిస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయంలో ఎలాంటి దుమారం రేపుతుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment