ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన నేపథ్యంలో తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పదో షెడ్యూల్ కింద దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు చట్టాన్ని సరైన రీతిలోనే అర్థం చేసుకుని తీర్పు ఇచ్చిందని పేర్కొంది.
విచారణలో దానం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ.. పదో షెడ్యూల్‌లోని నిబంధనలను ప్రస్తావిస్తూ తన వాదనలు వినిపించినా ధర్మాసనం వాటిని అంగీకరించలేదు. దానం నాగేందర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడం అనర్హతకు కారణమైందని హైకోర్టు ఇప్పటికే తేల్చింది. ఆయన అనర్హత 2024 ఏప్రిల్ 23 నుంచే అమల్లోకి వస్తుందని, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోకపోవడంతో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవిపై ఉత్కంఠకు తెరపడింది.








