భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఆసియా క్రీడల్లో ఎట్టకేలకు పతకం సాధించారు. ఐచి-నాగోయా ఆసియా క్రీడలు 2026లో మహిళల 49 కేజీల విభాగంలో చాను రజత పతకం గెలుచుకున్నారు. ఆమె మొత్తం 198 కేజీల బరువును ఎత్తారు. ఇందులో స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు లిఫ్ట్ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఉత్తర కొరియాకు చెందిన రి సాంగ్-గమ్ స్వర్ణం, ఇండోనేషియాకు చెందిన లులుక్ దియానా త్రి విజాయానా కాంస్యం సాధించారు.
మీరాబాయి చాను సాధించిన ఈ రజతంతో ఆసియా క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టింగ్‌కు 28 ఏళ్ల తర్వాత పతకం దక్కింది. 2014 ఇంచియాన్ ఆసియా క్రీడల్లో 9వ స్థానంలో నిలిచిన చాను.. 2018 జకార్తా క్రీడలకు గాయం కారణంగా దూరమయ్యారు. 2023 హాంగ్‌జౌ క్రీడల్లో 49 కేజీల విభాగంలో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. నాగోయాలో రజతం సాధించడం ద్వారా ఆమె కెరీర్‌లో మిగిలిన ముఖ్యమైన పతకాల జాబితాలో ఆసియా క్రీడల మెడల్ కూడా చేరింది.
మీరాబాయి చాను కెరీర్‌లో ఈ విజయం మరో కీలక మైలురాయిగా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో 49 కేజీల విభాగంలో రజతం, 2017 ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, కామన్వెల్త్ గేమ్స్‌లో పలు పతకాలు సాధించిన ఆమెకు ఆసియా క్రీడల మెడల్ మాత్రం ఇంతవరకు అందలేదు. గాయాలు, ఎదురుదెబ్బలను అధిగమించి నాగోయాలో రజతం సాధించడం ద్వారా ఆ లోటును చాను భర్తీ చేశారు.









పెళ్లి వరకు వెళ్లి వెనక్కి వచ్చా.. శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్