తెలంగాణలో 22A నిషేధిత జాబితా అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చిన అంశంపై స్వతంత్ర విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశించింది. ఈ వ్యవహారంలో తీసుకున్న చర్యలు, విచారణ పురోగతిపై నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించింది. హైదరాబాద్కు చెందిన న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ సెప్టెంబర్ 14న NHRCకి ఫిర్యాదు చేశారు. 22A జాబితాలో ప్రైవేట్ భూములు చేరడం వల్ల ఆస్తుల రిజిస్ట్రేషన్, లావాదేవీల్లో ప్రజలు మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదుపై NHRC విచారణ చేపట్టి, 22A జాబితా కారణంగా ప్రజల ఆస్తి హక్కులకు భంగం కలుగుతున్న అంశాలను పరిశీలించింది. జీవించే హక్కు, సమానత్వ హక్కు, వృత్తి లేదా వ్యాపారం నిర్వహించే హక్కు, ఆస్తి హక్కులకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను కమిషన్ ప్రస్తావించింది. ముఖ్యంగా ఆర్టికల్ 21, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19(1)(g), ఆర్టికల్ 300-A కింద ఉన్న హక్కులపై దృష్టి సారించింది. ప్రైవేట్ భూములు 22A జాబితాలోకి ఎలా చేరాయి, వాటిని చేర్చే ప్రక్రియలో ఏమైనా లోపాలు చోటుచేసుకున్నాయా అనే అంశాలపై స్వతంత్ర విచారణ జరపాలని ఆదేశించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 22A సంబంధిత సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో, తాజా NHRC ఆదేశాల మేరకు చేపట్టిన చర్యలపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.








