నాడు మోదీపై విమర్శలు.. నేడు కాశీలో ప్రశంసలు

నాడు మోదీపై విమర్శలు.. నేడు కాశీలో ప్రశంసలు

Summarize with AI

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత ప్రత్యర్థులు ఉండరనే మాటకు అనుగుణంగా రాజకీయ సమీకరణాలు మారుతుంటాయి. అయితే గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర వ్యక్తిగత, రాజకీయ విమర్శలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు మోదీ పుట్టినరోజు వేడుకల కోసం ఏకంగా వారణాసి వెళ్లి ఆయనను ప్రశంసిస్తున్న తీరు రాజకీయ చర్చకు దారితీస్తోంది.

మోడీ పుట్టినరోజు సందర్భంగా వారణాసిలో జరిగిన ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. వారణాసికి వెళ్లిన చంద్రబాబు.. తొలుత కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. అనంతరం ‘సేవా సంకల్ప యాత్ర’ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మోదీని ప్రశంసిస్తూ.. దేశం ఆయనను చూసి గర్విస్తోందని, వారణాసి మోదీ కర్మభూమి అని వ్యాఖ్యానించారు. చిన్నతనంలో మోదీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అవి ఆయన ఎదుగుదలను అడ్డుకోలేకపోయాయని చంద్రబాబు, మోదీకి అందరూ మద్దతుగా నిలవాలని కూడా పిలుపునిచ్చారు. మోదీని ‘జాతి సంపద’గా అభివర్ణిస్తూ ఆయనపై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఒకప్పుడు ‘సీనియర్‌ నేనే’ అంటూ..
చంద్రబాబు గతంలో తన రాజకీయ అనుభవాన్ని ప్రస్తావిస్తూ మోదీ కంటే తాను సీనియర్‌ నాయకుడినని పలుమార్లు చెప్పుకున్నారు. 2019 ఎన్నికల ముందు ఏపీ అసెంబ్లీలో చేసిన ప్రసంగంలోనూ 1978లో తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, మోదీ 2002లో రాజకీయాల్లోకి వచ్చారని ప్రస్తావించారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో విభేదించిన సమయంలో ఢిల్లీలో ‘ధర్మపోరాట దీక్ష’ చేపట్టి.. మోదీని తూల‌నాడిన విష‌యాల‌ను రాష్ట్ర ప్ర‌జ‌లు గుర్తుచేసుకుంటున్నారు. అంతేకాదు.. ఏపీ అసెంబ్లీ సాక్షిగా భార్య‌ను చేసుకోలేని వ్య‌క్తి.. దేశాన్ని ఎలా చూసుకుంటాడు అని మోదీని ఉద్దేశించి అవ‌మాన‌క‌రంగా మాట్లాడిన విష‌యాలు సైతం ఈ సంద‌ర్భంగా చ‌ర్చ‌కు రావ‌డం విశేషం.

‘అమరావతికి మట్టి తప్ప ఏం ఇచ్చారు?’
అమరావతి విషయంలోనూ మోదీపై చంద్రబాబు గతంలో తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం నుంచి రాజధానికి సహకారం అందలేదని.. మోదీ అమరావతికి పార్ల‌మెంట్ మట్టి, నీరు త‌ప్ప ఏమిచ్చార‌ని విమర్శించిన విష‌యం తెలిసిందే. కానీ, ఇప్పుడు అదే మోదీ పుట్టినరోజు కార్యక్రమం కోసం ప్ర‌ధాన‌మంత్రి పాతినిథ్యం వ‌హిస్తున్న వార‌ణాసి వెళ్లి.. సుప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన కాశీలో శివ‌లింగానికి వెళ్లి లో చంద్రబాబు పాల్గొని ఆయనను ప్రశంసించడంతో.. గత వ్యాఖ్యలను గుర్తుచేస్తూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

‘ఇంతగా పొగడాల్సిన అవసరమా?’
చంద్రబాబు తాజా వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మోదీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అదే మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్నారని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘సీనియర్‌ నేనే’ అంటూ ఒకప్పుడు మోదీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. ఇప్పుడు మోదీని ‘జాతి సంపద’గా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపించడం మాత్రం రాజకీయ చర్చకు కారణమైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment