హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ సంస్థానం విమోచనం, భారతదేశంలో విలీనం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ విమోచన పోరాటంలో పాల్గొన్న మరుగునపడిన వీరుల కథలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పోరాటం కేవలం ప్రభుత్వాలు లేదా ప్రముఖ నాయకులకు సంబంధించినది కాదని, విద్యార్థులు, మేధావులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ కార్యకర్తలు, రైతులు, సామాన్య ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజా ఉద్యమమని పేర్కొన్నారు.
రాంజీ గోండ్, తుర్రేబాజ్ ఖాన్, కొమురం భీమ్ తదితర వీరుల త్యాగాలను జాతీయ స్మృతిలో నిలుపుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. అనేక మంది పోరాట యోధులు జైలు శిక్షలు, హింస, వ్యక్తిగత ఇబ్బందులను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. స్వతంత్ర భారతదేశ ఏకీకరణలో భారతరత్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని, బలమైన, ఏకీకృత భారతదేశానికి ఆయన దృఢమైన పునాది వేశారని అన్నారు. అసాధ్యంగా కనిపించిన హైదరాబాద్ ఏకీకరణను పటేల్ సుసాధ్యం చేశారని పేర్కొంటూ, హైదరాబాద్ ప్రజలు రజాకార్లకు వ్యతిరేకంగా ప్రదర్శించిన ధైర్యం, పోరాట స్ఫూర్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు.
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనడంలో కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో కలిసి కీలకంగా పనిచేశాయని ఉపరాష్ట్రపతి తెలిపారు. నక్సల్ రహిత, సురక్షిత, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంగా కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయని అన్నారు. రాజకీయ విలీనం భూభాగాలను ఏకం చేస్తే.. రాజ్యాంగ ప్రజాస్వామ్యం ప్రజలను ఏకం చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడికి సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు కల్పించినప్పుడే జాతీయ ఐక్యత మరింత బలపడుతుందని తెలిపారు. 2022 నుంచి హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నామని, ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తితో దేశ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. “భారత్ ఒక్కటే.. భారత్ ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంది. ఇదే సర్దార్ పటేల్‌కు మనం అందించే నిజమైన నివాళి” అని రాధాకృష్ణన్ అన్నారు.








