ఆళ్ల నాని మరణం.. టీడీపీ వైఖ‌రిపై విమ‌ర్శ‌లు!

ఆళ్ల నాని మరణం.. టీడీపీ వైఖ‌రిపై విమ‌ర్శ‌లు

Summarize with AI

పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక రాజకీయ నేతగా ఎదిగిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) అకాల మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. విశాఖపట్నంలో గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, డిప్యూటీ సీఎంగా, అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం సుదీర్ఘమైనది. అయితే ఆయన మరణం తర్వాత టీడీపీ అగ్రనాయకత్వం, ఆ పార్టీ స్థానిక నేతల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదనే విమర్శలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌ పార్టీతో ప్రారంభమైంది. 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. 2004లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అంబికా కృష్ణపై 33,053 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లోనూ ఏలూరు నుంచి గెలుపొందారు.

వైఎస్సార్ మ‌ర‌ణం త‌రువాత‌.. కొన్నాళ్లు కాంగ్రెస్‌లోనే ఉన్నా.. 2013లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీ చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయినప్పటికీ.. ఆ తర్వాత పార్టీ అధినేత వైఎస్ జగన్‌ ఆయనకు త‌గిన ప్రాధాన్యత ఇచ్చారు. 2017లో వైసీపీకి లభించిన పరిమిత ఎమ్మెల్సీ అవకాశాల్లో ఆళ్ల నానికి కూడా అవకాశం దక్కింది. అనంతరం 2019 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.

జగన్‌ కేబినెట్‌లో కీలక స్థానం
2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆళ్ల నానికి కీలక బాధ్యతలు దక్కాయి. డిప్యూటీ సీఎంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ వంటి అత్యంత కీలకమైన శాఖను ఆయనకు అప్పగించారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య వ్యవస్థను సమన్వయం చేయడంలో ఆళ్ల నాని కీలకంగా వ్యవహరించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తవారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో రెండోసారి కేబినెట్‌లో మార్పుల సమయంలో ఆళ్ల నాని మంత్రి పదవిని కోల్పోయారు.

జగన్‌తో సన్నిహితంగా..
జగన్‌తో కలిసి పనిచేసిన నాయకుల్లో ఆళ్ల నాని కూడా ఒకరు. పార్టీకి ఆయన అందించిన సేవలు, జిల్లాలో పార్టీ బలోపేతానికి చేసిన కృషి కారణంగా జగన్‌ ఆయనకు సముచిత ప్రాధాన్యత ఇచ్చారనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లో ఉంది. అధికారంలో ఉన్న సమయంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వంటి కీలక పదవులు దక్కడం కూడా ఆయనకు పార్టీలో ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుంద‌ని ఆ పార్టీ నేతలు గుర్తుచేసుకుంటున్నారు.

2024 తర్వాత మారిన రాజకీయ సమీకరణాలు
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారాయి. ఈ క్రమంలో ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. జగన్‌ హయాంలో కీలక పదవులు అనుభ‌వించి.. టీడీపీలో చేరడం అప్పట్లో వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ పార్టీ నేతలు కూడా ఈ చేరిక‌పై పెద్ద‌గా విమ‌ర్శ‌లు చేసిన దాఖ‌లాలు లేవు. ఆళ్ల‌ నానితో వైసీపీ నేత‌ల‌కు వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలున్నాయి.

నాని మరణంపై వైసీపీ స్పందనపై చర్చ
ఆళ్ల నాని మరణవార్త వెలువడిన వెంటనే వైసీపీ నేతలు, సహచర మాజీ మంత్రులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫు నుంచి చంద్ర‌బాబు, లోకేష్‌, పార్థ‌సార‌ధి మిన‌హా ఇత‌ర నాయ‌కులెవ‌రూ ఆళ్ల నానికి నివాళుల‌ర్పిస్తూ సందేశం ఇచ్చిన దాఖ‌లాలు లేవు. క‌నీసం టీడీపీ అధికారిక సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ నుంచి నివాళుల‌ర్పిస్తూ ఒక్క‌పోస్టు కూడా పెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కానీ, ఇటు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మొద‌లు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లంద‌రూ ఆళ్ల నానికి నివాళుల‌ర్పిస్తూ.. ఆయ‌న‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. రాజకీయంగా ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరినప్పటికీ.. వ్యక్తిగత సంబంధాలు, గత రాజకీయ ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ నేతలు ఆయన మరణంపై స్పందించడం చర్చనీయాంశంగా మారింది.

సొంతింట్లో ద‌క్కిన గౌర‌వం ద‌క్కుతుందా..?
మ‌న ఇల్లు, మ‌న ఊర్లో ద‌క్కిన గౌర‌వం.. మ‌నం వేరే ప్రాంతాల‌కు వెళ్లిన‌ప్పుడు దక్క‌దు అని ఒక నానుడి ఉంది. ఇప్పుడు అదే మాట‌ను గుర్తుచేసుకుంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరినా.. వైసీపీ శ్రేణుల తీరు చూస్తే అలాగే ఉందంటున్నారు. నాని మ‌ర‌ణంతో టీడీపీ శ్రేణులకు పెద్ద‌ లోటు అనిపించ‌క‌పోయినా.. డిప్యూటీ సీఎంగా, క‌రోనా స‌మ‌యంలో మంత్రిగా ఆయ‌న అందించిన సేవ‌ల‌ను వైసీపీ శ్రేణులు గుర్తుచేసుకోవ‌డం చర్చ‌నీయాంశంగా మారింది. మాజీ మంత్రి కోడెల శివ‌ప్ర‌సాద్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పించిన టీడీపీ.. ఆళ్ల నాని కోసం ఒక సంతాప సందేశాన్ని కూడా అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాల నుంచి అందించ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment