విశాఖ పోర్టులో పట్టుబడిన బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్ ఇచ్చారు. అవి పీడీఎస్ బియ్యమని, అక్రమంగా తరలిస్తున్నారని, వాటిని సీజ్ చేసి సదరు సంస్థపై కేసు నమోదు చేశామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గత నెలలో ప్రకటించారు. నెల రోజుల తరువాత అవి రేషన్ బియ్యం కాదంటూ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రి అనుచరుల ఒత్తిడితో బియ్యం తరలింపునకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
గత నెల 9న కంటైనర్ టెర్మినల్‌లో ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కంటైనర్ ఫ్రైట్ స్టేషన్‌లో 483 టన్నుల రేషన్ బియ్యం గుర్తించినట్లు ఆయన ప్రకటించారు. దీంతో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బియ్యం తీసుకొచ్చిన సంస్థపై కేసు నమోదు చేసినట్లు మంత్రి మనోహర్, పౌరసరఫరాల శాఖ అధికారులు సైతం హడావిడిగా ప్రకటించారు.
సరిగ్గా నెల రోజులు కూడా గడవక ముందే అవి రేషన్ బియ్యం కాదంటూ డిస్టిక్ట్ర్ మేజిస్ట్రేట్ ధృవీకరించారు. సీజ్ చేసివాటిలో 259 టన్నులు సక్రమమని, వాటిని బిబో సంస్థకి ఎగుమతి కోసం అప్పగిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బియ్యంని విడిచిపెట్టాలంటూ మంత్రి అనుచరులు కలెక్టర్ పై ఒత్తిడి తీసుకొచ్చారని, దీంతో పట్టుబడిన బియ్యానికి క్లీన్ చిట్ లభించిందని తెలుస్తోంది. రేపోమాపో ఆ బియ్యం చైనాకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.







