ఎగ‌తాళి కోస‌మే చంద్రబాబుకు ‘వాటర్‌మెన్’ బిరుదు

ఎగ‌తాళి కోస‌మే చంద్రబాబుకు ‘వాటర్‌మెన్’ బిరుదు

Summarize with AI

సీఎం చంద్రబాబు నాయుడికి ‘వాటర్‌మెన్’ అంటూ ఎకనామిక్స్ టైమ్స్‌ పత్రికలో ఆర్టిక‌ల్ రావ‌డంపై తెలుగుదేశం పార్టీ గ‌ర్వంగా చెప్పుకుంటోంది. నిన్న క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో మంత్రి ప‌య్యావుల అధికారులంద‌రితో సీఎంకు క్లాప్స్ కొట్టించారు. వాట‌ర్ మెన్ బిరుదును టీడీపీ ప్ర‌చారం చేసుకుంటున్న సంద‌ర్భంగా వైసీపీ నేత‌ భూమన కరుణాకరరెడ్డి వ్యంగ్యంగా స్పందించారు.

‘వాటర్‌మెన్’ బిరుదు ఇవ్వడం ఆయనకు గౌరవం కాదని, బిరుదు ఇచ్చినవారే తమ గౌరవాన్ని తగ్గించుకున్నట్లవుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ‘వాటర్‌మెన్’ బిరుదు ఇవ్వడం ఆయనపై ప్రశంస కాదని.. ఎగతాళి చేయడానికే ఇచ్చిన బిరుదుగా ప్రజలు భావిస్తున్నారన్నారు.

“చంద్రబాబు–కరువు ఒకే కడుపున పుట్టిన కవల పిల్లలు” అని ప్రజలు భావిస్తున్నార‌ని భూమ‌న‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు గత పాలనలను ప్రస్తావిస్తూ.. 1995–2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో 1,400 మండలాల్లో 1,200 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని ఆరోపించారు. 2014–19 మధ్య కూడా కరువు, అతివృష్టి పరిస్థితులు వచ్చాయని గుర్తుచేశారు. చంద్రబాబు పాలన అంటే కరువు తప్పదనే అభిప్రాయం ప్రజల్లో ఉందని భూమన అన్నారు.

రాయలసీమలో సుమారు 70 ఏళ్ల క్రితం వచ్చిన డొక్కల కరువు.. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు పాల‌న‌లో దాపురించింద‌ని, మళ్లీ అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబుకు స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బహుశా మనసులోనైనా అధికారులు, “చంద్రబాబు వస్తే కరువు వస్తుంది” అని అనుకుంటారని సెటైర్లు పేల్చారు.

గతంలో ఎల్‌నినోను ధైర్యంగా ఎదుర్కొంటామని, హుద్‌హుద్ తుఫానును ఎదుర్కొంటామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా భూమ‌న‌ ప్రస్తావించారు. ఇలాంటి వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనపై భూమన కరుణాకరరెడ్డి చేసిన ఈ విమర్శలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. భూమన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment