చిన్న శ్రీను చేరిక.. టీడీపీ-జనసేన మధ్య సోషల్ వార్!

చిన్న శ్రీను చేరిక.. టీడీపీ-జనసేన మధ్య సోషల్ వార్!

Summarize with AI

ఏపీలో(AP) అధికార కూటమి పార్టీలైన టీడీపీ(TDP), జనసేన (Janasena) మధ్య మరోసారి సోష‌ల్ వార్ మొద‌లైంది. వైసీపీ (YSRCP) నేత మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు (చిన్న శ్రీను)(Majji Srinivasa Rao (Chinna Srinu) టీడీపీలో(TDP) చేరిక వ్యవహారం ఇప్పుడు కూటమి పార్టీల మ‌ధ్య విభేదాల‌కు దారితీస్తోంది. ఆయన చేరికను జనసేన కార్యకర్తలు, మరోవైపు కొందరు టీడీపీ నేతలు సైతం వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

వైసీపీ ఓడిపోయిన త‌రువాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineneni Srinivasa Reddy) జనసేనలో చేరిన సమయంలో టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన విషయాన్ని జనసేన కార్యకర్తలు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. ‘‘అప్పుడు బాలినేనిని చేర్చుకోవడాన్ని టీడీపీ వ్యతిరేకించింది.. ఇప్పుడు చిన్న శ్రీను చేరికను ఎందుకు స‌మ‌ర్థించుకుంటుంది’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. బాలినేని కోవ‌ర్ట్ (Balineneni Covert) అని ప్ర‌చారం చేసిన టీడీపీ.. ఇప్పుడు అదే పార్టీ నుంచి వ‌చ్చిన చిన్న శ్రీనును ఎలా చేర్చుకుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

‘చిన్న శ్రీను విషయంలో మేము మాట్లాడకూడదా?’
చిన్న శ్రీనుపై గతంలో పలు వివాదాలు, ఆరోపణలు ఉన్నాయని జనసేన కార్యకర్తలు సోషల్‌ మీడియాలో ప్రస్తావిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో చోటుచేసుకున్న ఘటనలను కూడా ప్రస్తావిస్తూ.. ఆయన రాజకీయ ప్రస్థానంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉద్యమ సమయంలో ఇద్దరు విద్యార్థుల చావుకి కారణం అని విజయనగరంలో తరిమి కొట్టారు. అక్కడ నుంచి మొదలు అనేక అరాచకాలు చేసిన చిన్న శ్రీను గురించి మేము మాట్లాడొచ్చా? అంటూ జ‌న‌సైనికులు ప్ర‌శ్నిస్తున్నారు.

మేయర్‌ పదవిపై కొత్త చర్చ
చిన్న శ్రీను చేరిక వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే చర్చ కూడా కూటమి వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలో జరగనున్న మేయర్‌ ఎన్నికల్లో(Mayor Election) ఆయన కుమార్తెకు అవకాశం కల్పించే షరతుతోనే వైసీపీ మీద ఉన్న కోపంతోనే తెలుగుదేశం పార్టీ(TDP) ఈ చ‌ర్య‌కు పూనుకుంద‌ని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రలో పలువురు సీనియర్‌ నేతలు ఉండగా.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మేయర్‌, జెడ్పీ చైర్మన్‌ వంటి కీలక పదవుల్లో అవకాశాలు కల్పిస్తారా? అంటూ టీడీపీ, జనసేనలోని కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ‘‘ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పక్కనపెట్టి వలస వచ్చిన నేతలకు పదవులు కట్టబెడతారా?’’ అనే ప్రశ్న ఇప్పుడు కూటమిలో చర్చకు దారితీస్తోంది.

సోషల్‌ మీడియాలో మరింత ముదురుతున్న వార్‌
ఇటీవల టీడీపీ-జనసేన మధ్య విభేదాలు సోషల్‌ మీడియా వేదికగా బహిరంగం కావడం కూటమి రాజకీయాల్లో కలకలం రేపింది. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు, సోషల్‌ మీడియా విభాగాలు ఒకరిపై ఒకరు విమర్శలు, మీమ్స్‌, ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్న పరిస్థితులు క‌నిపించాయి. జనసేన కార్యకర్తలు టీడీపీ నాయకత్వాన్ని టార్గెట్‌ చేస్తూ పోస్టులు పెడుతుండగా.. ఐటీడీపీ (ITDP) వర్గాలు పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan), ఆయన రాజకీయ పనితీరుపై విమర్శలు చేస్తూ వీడియోలు, పోస్టులు ప్రచారం చేస్తున్న నేప‌థ్యంలో టీడీపీ-జ‌న‌సేన అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాల్లో హెచ్చ‌రిక‌లు చేస్తూ ఓ సందేశాన్ని పోస్టు చేసిన విష‌యం తెలిసిందే.

డీఎస్సీ అంశం.. కూటమి మధ్య మరో చిచ్చు?
ప్రస్తుతం మెగా డీఎస్సీ-2025 (Mega DSC-2025) వ్యవహారం కూడా టీడీపీ-జనసేన సోషల్‌ మీడియా వార్‌కు మరో కారణంగా మారిందనే చర్చ సాగుతోంది. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై ప్రతిపక్షాలు, అభ్యర్థులు ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో.. జనసేన అనుకూల సోషల్‌ మీడియా ఖాతాలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పోస్టులు పెడుతున్నాయని టీడీపీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం కలిగించేలా డీఎస్సీ అంశాన్ని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని కొందరు టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ‘‘డీఎస్సీపై ప్రతిపక్షాలు నారా లోకేశ్‌ను (Nara Lokesh) టార్గెట్‌ చేస్తున్నప్పుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఎందుకు స్పందించడం లేదు?’’ అంటూ ఐటీడీపీ అనుకూల వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

కూటమిలో విభేదాలు మళ్లీ బజారుకు?
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు, సీట్ల పంపకాలు, పదవుల కేటాయింపులపై కూటమి పార్టీల మధ్య అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో చిన్న శ్రీను చేరిక వ్యవహారం కొత్త వివాదానికి కారణమవుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు చేరికలు, మరోవైపు పదవుల పంపకంపై అసంతృప్తి.. దీనికి తోడు సోషల్‌ మీడియాలో పరస్పర విమర్శలు, డీఎస్సీ వంటి సున్నితమైన అంశాలపై భిన్న వైఖరులు.. ఇవన్నీ కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడుతున్నాయనే చర్చకు కారణమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment