మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో రామోజీరావుకు న్యాయస్థానాలు క్లీన్చిట్ ఇచ్చాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. రామోజీరావు మరణించడంతో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసు చట్టప్రకారం అబేట్ అయిందని, అంతేతప్ప ఆరోపణలు వీగిపోయాయని, ఆయన నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వలేదని స్పష్టం చేశారు. కేసు కొట్టివేయడం, నిందితుడు మరణించడంతో కేసు అబేట్ కావడం రెండూ వేర్వేరు విషయాలని వివరించారు.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసుపై రామోజీరావుకు చెందిన పత్రిక ఈనాడు చేస్తున్న ప్రచారాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ తిప్పికొట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన ప్రభుత్వం నియమించిన ఐపీఎస్ అధికారి కృష్ణంరాజు నాంపల్లి కోర్టులో మార్గదర్శిపై క్రిమినల్ ఫిర్యాదు చేశారని ఉండవల్లి తెలిపారు. అయితే రామోజీరావును ఒక్కరినే నిందితుడిగా చేర్చడంతో, ఆయన మరణం తర్వాత క్రిమినల్ విచారణ కొనసాగించే అవకాశం లేకుండా పోయిందన్నారు. రామోజీరావు మరణంతో కేసు అబేట్ అయినప్పటికీ, చట్టపరమైన ప్రశ్నలను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
2018లో రామోజీరావు ఈ క్రిమినల్ ఫిర్యాదును హైకోర్టులో కొట్టివేయించుకున్నారని, దానిని సవాల్ చేస్తూ తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానని చెప్పారు. తన వాదనను స్వీకరించిన సుప్రీంకోర్టు, కేసును తిరిగి హైకోర్టుకు పంపి కీలక అంశాలను పరిశీలించాలని సూచించిందన్నారు.
మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం చట్టవిరుద్ధమని ఆర్బీఐ అధికారులు వాదించారని గుర్తుచేశారు. రామోజీరావు మరణంతో కేసు అబేట్ అయిన కోర్టు ఉత్తర్వులను ‘క్లీన్చిట్’గా, ‘నిజం గెలిచింది’ అన్నట్లుగా ప్రచారం చేయడం సరికాదని ఉండవల్లి అన్నారు. కోర్టు మార్గదర్శి ఎలాంటి చట్ట ఉల్లంఘన చేయలేదని లేదా రామోజీరావుపై వచ్చిన ఆరోపణలు తప్పని నిర్ధారించలేదని స్పష్టం చేశారు.
డిపాజిట్ల చెల్లింపుల సమయంలో ఇచ్చిన ప్రకటనలు, డిపాజిటర్లతో ఫైనల్ సెటిల్మెంట్ చేయడం, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన లెక్కలు కూడా బయటకు రావాల్సి ఉందన్నారు. సుమారు రూ.2,600 కోట్ల డిపాజిట్లపై వడ్డీ అంశాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
2007లో తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ రామోజీరావుకు సుమారు రూ.1,100 కోట్లకు సంబంధించిన అంశాలపై నోటీసులు ఇచ్చిందని ఉండవల్లి తెలిపారు. ఆ కేసు ప్రస్తుత పరిస్థితిపై సమాచారం కోరగా, వ్యక్తిగత పన్ను సమాచారం అంటూ అధికారులు నిరాకరించారని చెప్పారు. దీనిపై ఆర్టీఐ అప్పీల్ చేశానని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తానన్నారు.
అదేవిధంగా సుమారు 2,200 ఎకరాల భూమికి సంబంధించిన భూ పరిమితి వ్యవహారాన్ని కూడా ఉండవల్లి ప్రస్తావించారు. ఇందులో 1,364 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించాలంటూ అప్పట్లో నోటీసులు ఇచ్చారని, ఈ అంశంపైనా చట్టపరమైన ప్రశ్నలు ఉన్నాయని తెలిపారు.
అగ్రిగోల్డ్ వ్యవహారంలో యాజమాన్యాన్ని అరెస్టు చేసి, ఆస్తులు సీజ్ చేసి కేసులు పెట్టినప్పుడు.. మార్గదర్శి విషయంలో ఎందుకు అదే స్థాయిలో చర్యలు తీసుకోలేదని ఉండవల్లి ప్రశ్నించారు. పెద్దవారికి ఒక చట్టం, సామాన్యులకు మరో చట్టం ఉండకూడదన్నారు. ప్రారంభంలోనే చట్టాలను కఠినంగా అమలు చేసి ఉంటే ప్రజల నుంచి భారీ మొత్తాలు సేకరించే సంస్థల సమస్యలు ఇంత పెద్దవిగా మారేవి కావని అభిప్రాయపడ్డారు. రామోజీరావు మరణంతో కేసు అబేట్ అయినప్పటికీ, చట్టపరమైన ప్రశ్నలను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
మార్గదర్శి వ్యవహారంలో సెక్షన్ 45–ఎస్, డిపాజిట్ల సేకరణ, చెల్లింపులు, వడ్డీ, ఐటీ వ్యవహారం, భూ పరిమితి వంటి అంశాలపై తన పోరాటం కొనసాగుతుందని ఉండవల్లి తెలిపారు. న్యాయస్థానాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, అవసరమైతే అందుబాటులో ఉన్న న్యాయపరమైన మార్గాలను వినియోగించడంతో పాటు రాష్ట్రపతి వరకు కూడా వెళ్తానని స్పష్టం చేశారు.








