సామాన్యులకు ఒక న్యాయం.. వీరికి మరో న్యాయమా?

సామాన్యులకు ఒక న్యాయం.. వీరికి మరో న్యాయమా?

Summarize with AI

రోడ్డు ప్రమాదాల్లో ఒకరి ప్రాణం పోయినప్పుడు చట్టం అందరికీ సమానంగా వర్తించాలా? లేక రాజకీయ పలుకుబడి ఉన్నవారికి ప్రత్యేక వెసులుబాటు ఉంటుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా జనసేన నాయకుల కుమారులు చేసిన రెండు రోడ్డు ప్రమాద కేసుల్లో హైదరాబాద్‌ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్‌కు సంబంధించిన యాక్సిడెంట్‌ కేసుతో పాటు.. పవన్ కళ్యాణ్ స్నేహితుడు, టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్‌ సాయి కుమారుడు సందీప్ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో పోలీసులు తీసుకున్న చర్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఈ రెండు కేసుల్లోనూ నిందితులకు కండీషనల్‌ బెయిల్‌ లభించడం, ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను చంపేసిన కేసుల్లో నిందితులు ద‌ర్జాగా తిరుగుతుండ‌గా, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ఒక సాధారణ వ్యక్తి ర్యాష్‌ డ్రైవింగ్ చేసి ఒకరి ప్రాణం పోయేలా చేస్తే.. అతనిపై పోలీసులు ఇదే విధంగా వ్యవహరిస్తారా? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు టెస్టులు, ల్యాబులు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయడం వంటి కంటి తుడ‌పు చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా.. కేసు తీవ్రతను బట్టి చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు.

ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్నేహితుడు ఆనంద్ సాయి కుమారుడు హిట్‌ అండ్‌ రన్‌ ఘటన జరిగి దాదాపు వారం రోజులు కావస్తున్నా నిందితుడిని అదుపులోకి తీసుకుని కండీషనల్‌ బెయిల్‌పై విడుదల చేయడంపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా ప్రభావం చూపగల కుటుంబాలకు చెందినవారికి ఒక రకమైన న్యాయం, సామాన్యులకు మరో రకమైన న్యాయం ఎందుకని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు.

గతంలో జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్‌ నడిపిన కారు ప్రమాదంలో ఓ నిరుపేద యువతి మృతి చెందిన ఘటన కూడా ఇదే తరహాలో చర్చకు వచ్చింది. ఆ కేసులో పోలీసులు తీసుకున్న చర్యలు, నిందితుడిపై నమోదైన కేసు, బెయిల్‌ వ్యవహారంపై అప్పట్లోనూ ప్రశ్నలు తలెత్తాయి. జ‌న‌సేన ఎంపీ త‌న కుమారుడిని ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు పోలీసుల‌కు ఎంత కావాలంటే అంత ఇస్తా అనే ఆఫ‌ర్ కూడా ప్ర‌క‌టించిన‌ట్టుగా కొన్ని వార్తా ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు సైతం రావ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

ప్రస్తుతం ఆనంద్‌ సాయి కుమారుడు సందీప్‌ కేసులోనూ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అదే విధంగా ఉందని విమర్శకులు అంటున్నారు. ర్యాష్ డ్రైవింగ్‌తో మ‌నుషుల ప్రాణాలు తీసినా.. వారి ప‌ట్ల హైద‌రాబాద్ పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు విస్మ‌యానికి గురిచేస్తోంద‌ని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.

తెలంగాణలో రాజకీయ పలుకుబడి ఉన్న ఇతర రాష్ట్రాల నాయకుల కుమారులకు రక్షణ కల్పిస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఇటీవ‌ల ప్ర‌స్తావించిన విష‌యం తెలిసిందే. హైదరాబాద్‌లో ప్రమాదాలకు కారణమైన ఇతర పార్టీల ఎంపీల కుమారులపై కేసులు కూడా న‌మోదు చేయ‌డం లేద‌ని రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై ధ్వ‌జ‌మెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి చంద్ర‌బాబు శిష్యుడు కావ‌డంతోనే ఏపీ అధికార పార్టీ కుమారుల నేరాల‌పై హైద‌రాబాద్‌లో ర‌క్ష‌ణ దొరుకుతుంద‌ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

రాజకీయ పలుకుబడి ఉన్నవారికి పోలీసులు ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలకు తావులేకుండా దర్యాప్తును పారదర్శకంగా నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు.. మ‌నుషుల ప్రాణాలు తీసిన ఇద్ద‌రు జ‌న‌సేన నాయ‌కుల కుమారుల‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రు ప‌రిచి జైళ్ల‌కు త‌ర‌లించాల‌ని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ వాదులు.

Join WhatsApp

Join Now

Leave a Comment