భారత క్రికెట్లో 15 ఏళ్ల వయసులోనే సంచలనాలు సృష్టిస్తున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. అతడు ఒక్క సిరీస్ లేదా ఒక్క ఏడాదికే పరిమితం కాకుండా.. సుదీర్ఘ కాలం దేశానికి సేవలందించే క్రికెటర్‌గా ఎదగాలని బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో అతడికి సరైన మార్గదర్శకత్వం, అవసరమైన మద్దతు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. ముంబైలో జరిగిన సమీక్ష సమావేశంలో యువ ఆటగాళ్ల భవిష్యత్తుపై చర్చించినట్లు వెల్లడించారు. వైభవ్ కెరీర్‌ను అన్ని కోణాల్లో పర్యవేక్షిస్తూ.. అతడి ఆటతీరు, భవిష్యత్ నిర్ణయాలు, అవసరమైన మార్గదర్శకత్వంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు సైకియా పేర్కొన్నారు. అతడు ‘వన్ సిరీస్ లేదా వన్ ఇయర్ వండర్’గా మిగలకుండా సచిన్ టెండూల్కర్ తరహాలో సుదీర్ఘ కెరీర్ సాధించాలని బీసీసీఐ కోరుకుంటోందని తెలిపారు.
ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ వరుస రికార్డులతో తన సత్తా చాటుతున్నాడు. తాజాగా 15 ఏళ్ల 157 రోజుల వయసులో దులీప్ ట్రోఫీ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచి 57 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. అంతకుముందు జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 151 పరుగులు చేసి, భారత్ 3-0తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులు, 237.30 స్ట్రైక్‌రేట్‌తో అదరగొట్టి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అలాగే అండర్-19 ప్రపంచకప్‌లో 439 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్, అండర్-19, అంతర్జాతీయ స్థాయిలో వరుసగా రాణిస్తున్న వైభవ్‌ను సరైన విధంగా తీర్చిదిద్ది.. భవిష్యత్తులో భారత క్రికెట్‌కు కీలక ఆటగాడిగా నిలబెట్టడమే బీసీసీఐ లక్ష్యంగా కనిపిస్తోంది.








