సినిమాలను ఎంచుకునే విషయంలో ప్రేక్షకుల ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పు వస్తోందని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు స్టార్ హీరోల పేరును చూసి సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు.. ఇప్పుడు హీరోతో పాటు దర్శకుడి బ్రాండ్, మేకింగ్ స్టైల్, గత చిత్రాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రానా.. దర్శకుడు ఎలాంటి కథలను ఎంచుకుంటారు? వాటిని ఎలా తెరకెక్కిస్తారు? ఆయన గత చిత్రాలు ఎలా ఉన్నాయి? అనే అంశాలను కూడా నేటి ప్రేక్షకులు గమనిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా తమకంటూ ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్, బ్రాండ్‌ను ఏర్పరచుకున్న దర్శకుల సినిమాలపై ఆడియన్స్‌లో ఆసక్తి పెరుగుతోందని పేర్కొన్నారు.
ఎస్.ఎస్. రాజమౌళి, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ వంటి దర్శకుల సినిమాలకు హీరోలతో పాటు వారి బ్రాండ్ కూడా ప్రధాన ఆకర్షణగా మారిందని రానా అన్నారు. ఒక దర్శకుడి గత చిత్రాలపై ఉన్న నమ్మకంతో.. ఆయన కొత్త సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. డైరెక్టర్ స్టోరీ టెల్లింగ్, యాక్షన్ ట్రీట్‌మెంట్, విజువల్ ప్రెజెంటేషన్, మేకింగ్ స్టైల్ వంటి అంశాలు సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నాయని తెలిపారు. అయితే స్టార్ హీరోల ప్రాధాన్యత తగ్గిపోయిందని దీని అర్థం కాదని, హీరో, దర్శకుడు, కంటెంట్ కలిసి సినిమాకు బలంగా మారుతున్నాయని రానా పేర్కొన్నారు. పాన్ ఇండియా సినిమాల విస్తరణతో దర్శకుల బ్రాండింగ్‌కు మరింత ప్రాధాన్యత పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.








